అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ గతేడాది భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద గురువు నిత్యానందను కనిపెట్టడంలో సహకరించాలని ఇంటర్‌పోల్ ప్రపంచ దేశాలను కోరింది. నేరాలతో సంబంధమున్న వ్యక్తుల సమాచారాన్ని తప్పనిసరిగా తెలపాలని చెప్పే బ్లూ కార్నర్ నోటీసును నిత్యానందపై జారీచేసింది. ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయాలు వెల్లడించారు గుజరాత్ పోలీసులు.
నేరస్థులు కనిపించిన వెంటనే అరెస్టు చేయాలని చెప్పే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసును కూడా నిత్యానందపై జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.
గుజరాత్‌లోని నిత్యానందకు చెందిన ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన నేపథ్యంలో... గత నవంబరులో ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత నిత్యానంద దేశం విడిచి కనిపించకుండా పోయాడు.
ఇటీవల ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి 'కైలాస' అనే పేరు పెట్టానని, దానిని హిందూదేశంగా గుర్తించాలని నిత్యానంద ఓ వెబ్‌సైట్లో పేర్కొన్నాడు. ఐతే ఈ వార్తలను ఈక్వెడార్ ఖండించింది. నిత్యానంద తమ దేశం విడిచి హైతీ వెళ్లినట్లు తెలిపింది..
ఇదీ చూడండి : 'స్వతంత్రం' కోసం ఏడుగురి దారుణ హత్య- అడవిలో శవాలు