ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్షాలపై మండిపడ్డారు భాజపా నేతలు. ఈవీఎంల విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, భాజపా ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు.
మమతా బెనర్జీ, అమరీందర్ సింగ్‌లు ముఖ్యమంత్రులుగా గెలిచినప్పుడు ఈవీఎంలపై రాని సందేహాలు.. ప్రజలు మోదీని మరోసారి ప్రధానిగా కోరుకుంటుంటే వస్తున్నాయా అని విమర్శించారు.
''ఈవీఎంలపై ప్రశ్నిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే వారు నిరాశలో ఉన్నారు. ఓడిపోతారని తెలిసే.. పైకి అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈవీఎంలతోనే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచింది. అప్పుడు ఈవీఎం సరైనదే. అదే ఈవీఎంలతో మమతా రెండు సార్లు ముఖ్యమంత్రి, అమరీందర్ సింగ్ పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడూ ఈవీఎంలు బాగానే ఉన్నాయి. వారు గెలిచినప్పుడు ఈవీఎంలు సరిగ్గానే పనిచేశాయి. ఇప్పుడు మోదీని ప్రజలు మరోసారి ప్రధానిగా కోరుకుంటుంటే ఈవీఎంలపై అనుమానాలెందుకు.. విపక్షాలకు నేను చెప్పేది ఒకటే.. ఓటమిని కూడా మర్యాదపూర్వకంగా స్వీకరించాలి.''
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
అంతకుముందు ఈవీఎంల విషయమై 22 పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 వీవీప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల కంటే ముందే లెక్కించాలని డిమాండ్ చేశాయి.
ఒకవేళ అందులో ఏమైనా వ్యత్యాసముంటే.. నియోజకవర్గం పరిధిలోని 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు గణించాల్సిందేనని ఈసీకి నివేదించాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘం రేపు సమావేశమవుతామని హామీ ఇచ్చినట్లు విపక్ష నేతలు పేర్కొన్నారు.