బంగాల్ భాజపాలో ఇటీవల చేరికలు గణనీయంగా పెరిగాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు కమలం పార్టీలో చేరారు. అయితే ఇలా చేర్చుకోవడం వల్ల మొదటికే మోసం వస్తుందని భాజపా అధినాయకత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఇక మూకుమ్మడి చేరికలకు తలుపులేసేశామని ప్రకటించారు భాజపా నేతలు. అయితే స్థానిక నేతలతో చర్చించి ఎంపిక చేసిన వారిని మాత్రం చేర్చుకుంటామని భాజపా సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గీయ తెలిపారు.
"బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు బీ-టీమ్‌గా భాజపా మారాలనుకోవడం లేదు. సచ్ఛీలత లేని నాయకులను పార్టీలోకి చేర్చుకోం. అక్రమాలకు పాల్పడినవారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాకు అవసరం లేదు. కనుక మూకుమ్మడి చేరికలు ఇక ఉండవు. ఇక్కడి నుంచి చేరికలపై మరింత శ్రద్ధ పెడతాం. పరీక్షించి ఎంపిక చేసిన వారినే చేర్చుకుంటాం.
చాలా సందర్భాల్లో జిల్లా నాయకత్వాలు ఈ భారీ చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. పార్టీలో అంతర్గత కలహాలకు తావు లేదు. కనుక పార్టీలో చేరే వారికి జిల్లా నాయకత్వాలు నిరభ్యంతర పత్రం ఇస్తేనే చేర్చుకుంటాం."
- కైలాస్ విజయ్ వర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
భారీగా చేరికలు..
2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత టీఎంసీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని కమలనాథులు తమ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, సీపీఎం నుంచి చెరో ముగ్గురు, సీపీఐ నుంచి ఓ శాసనసభ్యుడు భాజపాలో చేరారు. తాజాగా మంగళవారం మరో టీఎంసీ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ భాజపాలో చేరారు. డైమండ్ హార్బర్ నుంచి దీపక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి భాజపాలో చేరినవారిలో సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం గమనార్హం.
294 అసెంబ్లీ స్థానాలు కలిగిన బంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరగనున్నాయి.