ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు భారీ తాయిలాలతో మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ వరుసలో కాంగ్రెస్ ముందుండగా.. భాజపా, ఝార్ఖండ్ ముక్తి మోర్చా తాజాగా ఎన్నికల ప్రణాళికను వెలువరించాయి.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..
భాజపా మరోమారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారీ తాయిలాలను ప్రకటించింది. తాము గెలిస్తే.. ప్రతిపేద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. వెనుకబడిన తరగతి, పేద కుటుంబాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ. 2,200.., 11, 12 తరగతుల విద్యార్థులకు రూ.7,500 ఉపకార వేతనం అందిస్తామని వాగ్దానం చేసింది.
రాంచీలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తామని, గిరిజన మహిళా స్వయం సహాయ బృందాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ భృతి..
ప్రతిపక్ష ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూడా భారీ తాయిలాతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తామని... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 67 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో 28 శాతం ఎస్టీలు, 27 శాతం బీసీలు, మరో 12 శాతం ఎస్సీలకు ఇస్తామని వెల్లడించింది. ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చట్టం చేస్తామని ప్రకటించింది. నిత్యావసరాల కోసం మహిళలకు నెలకు రూ.2వేలు, ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం అందిస్తామని పేర్కొంది. యువతకు రూ.5వేల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది.
ఐదు విడతల్లో...
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు.. మొత్తం 5 విడతల్లో జరగునున్నాయి. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: వ్రతం చెడ్డా దక్కని ఫలం..!