హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో.. మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ స్థానంలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలిచిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గెలుపొందారు.
నల్లేరుపై నడక...
గాంధీనగర్.. గాంధీ పుట్టిన రాష్ట్ర రాజధాని. ఆయన పేరే పెట్టుకున్న నియోజకవర్గం. అంతేకాదు.. కమలానికి కంచుకోట. గాంధీనగర్‌లో 1989 నుంచి భాజపా అభ్యర్థులు ఏకపక్ష విజయాలు సాధిస్తున్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ, శంకర్ సిన్హ్ వాఘేలా లాంటి హేమాహేమీలు భాజపా తరపున ఇక్కడ గెలుపొందారు.
1998 నుంచి.... అడ్వాణీ ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అమిత్ షా అడ్వాణీకి ఎన్నికల మేనేజర్‌గా పనిచేశారు.
హిందుత్వంతో పాటు అభివృద్ధి...
భాజపా హిందుత్వ నినాదానికి తోడు అభివృద్ది అజెండా కూడా అమిత్‌షా విజయానికి కారణంగా పేర్కొనవచ్చు. అభివృద్ధి అంశాలు ఏస్థాయిలో ఇక్కడ ప్రభావం చూపాయో అంతే స్థాయిలో మత ప్రాతిపదికనా ఓట్లుపడ్డాయని పరిశీలకులు భావిస్తున్నారు. మూస హిందుత్వ ధోరణులు వదిలిపెట్టి.. కొత్త పోకడలవైపు వడివడిగా అడుగులు వేస్తున్న కమలం పార్టీకి గాంధీ నగర్ ఓటర్లు మద్దతుగా నిలిచినట్లు విశ్లేషిస్తున్నారు.
భాజపాకు మంచి పట్టు..
గాంధీనగర్‌తోపాటు... అహ్మదాబాద్‌లోని పశ్చిమ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో గాంధీనగర్-ఉత్తరం, సనంద్, ఘట్లోడియా, వేజల్పుర్, నారన్‌పుర, సబర్మతి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో గాంధీనగర్-ఉత్తరం మినహా అన్ని స్థానాల్లోనూ భాజపా శాసనసభ్యులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో బలమైన ఓటుబ్యాంకు కలిగి ఉండటం కూడా కమలదళానికి ఉపయోగపడింది. నియోజకవర్గ పరిధిలో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండగా........ వేజల్పుర్, ఘట్లోడియా, నారన్‌పురలలో మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువ. పట్టణ ప్రాంత ఓటర్లు, మధ్యతరగతి ప్రజలు సహా..భాజపాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వ్యాపార వర్గాలు మరోసారి కమలానికే ఓటేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కార్యకర్తలతో మమేకం....
క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు, కార్యకర్తలతో అమిత్‌షా కు ఉన్న సంబంధాలు కమలదళపతి విజయానికి తోడ్పడ్డాయి. గతంలో షా ప్రాతినిధ్యం వహించిన సర్ఖేజ్, నారన్‌పుర శాసనసభ నియోజకవర్గాలు రెండూ గాంధీనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అమిత్ షా చాలా ఏళ్లు నారన్‌పుర నియోజకవర్గ పరిధిలో నివసించారు. అవన్నీ అమిత్ షా విజయానికి మరింత దోహదం చేశాయి.
మెజారిటీ వర్గం పాటీదార్లే....
గాంధీనగర్ జనాభాలో మెజారిటీ వర్గం పాటీదార్లు కాగా.. తర్వాతి స్థానాలలో ఎస్సీలు, వణిక్, ఠాకూర్, మైనారిటీ వర్గాలు ఉన్నాయి. ముస్లిం, ఎస్సీలు కాంగ్రెస్ వైపు ఉండగా మిగిలిన వర్గాల్లో అత్యధికులు భాజపాకు అనుకూలంగా ఓటేసినట్లు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన గాంధీనగర్ ఉత్తర ఎమ్మెల్యే సీజే చావ్లాకు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టులేకపోవడం, పక్కాగా ప్రచారం చేసే నాయకులు, కార్యకర్తలు కొరవడడం భాజపాకు లాభించిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.