''హరియాణా ప్రజల ఆదేశాన్ని స్వీకరించి... భాజపా- జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ సర్కారులో ముఖ్యమంత్రి భాజపా వైపు నుంచి, ఉపముఖ్యమంత్రి జేజేపీ నుంచి ఉంటారు. పలువురు స్వతంత్ర శాసనసభ్యులు కూడా ఈ కూటమికి మద్దతు తెలిపారు. భాజపా శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. వచ్చే ఐదేళ్ల వరకు భాజపా-జేజేపీ ప్రభుత్వం హరియాణా అభివృద్ధిని ప్రధాని మోదీ నేతృత్వంలో ముందుకు తీసుకువెళుతుంది.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి, భాజపా అధ్యక్షుడు
భాజపా శాసనసభా పక్షనేతను శనివారం ఎన్నుకున్న తర్వాత ఇరు పార్టీల నేతలు హరియాణా గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. హరియాణాలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతోనే భాజపాతో కలిసి ముందుకెళ్తున్నట్లు దుష్యంత్ చౌతాలా తెలిపారు.
ఉత్కంఠకు తెర...
హరియాణా ఎన్నికల ఫలితాల్లో భాజపా 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్‌ఎల్‌డీ 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. 90 స్థానాలున్న హరియాణాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు కావాలి. ఈ నేపథ్యంలో జేజేపీ ఎమ్మెల్యేలు, ఇతరులు కీలకమయ్యారు.
ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతు కోసం అటు కాంగ్రెస్, ఇటు భాజపా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. తొలుత భాజపా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా.. కళంకిత స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల కందా విషయంలో అటు విపక్ష, ఇటు స్వపక్ష శిబిరాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ప్రయత్నాన్ని భాజపా విరమించుకుంది. ఫలితంగా... జేజేపీతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది.