దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో.. పేరుగాంచిన పలు స్టీల్ ఉత్పత్తి సంస్థలు తమ ఉద్యోగులకు కొవిడ్ టీకా ఇవ్వాలనే యోచనలో ఉన్నాయి. దీని ద్వారా కేంద్రం చేపట్టిన టీకా డ్రైవ్ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నాయి.
దేశీయ స్టీల్ సంస్థలైన టాటా స్టీల్, అర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎమ్‌ఎన్‌ఎస్ ఇండియా), రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్)లు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాయి. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్) తమ అవసరాలకు సరిపడా టీకాలను అందించాల్సిందిగా వ్యాక్సిన్ తయారీ సంస్థలను సంప్రదించాయి.
అత్యధిక మోతాదులో టీకా డోసుల కోసం వ్యాక్సిన్ తయారీదారులను సంప్రదించాం. కరోనా యోధులకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత మాకు అందుతాయి. టీకా ఇచ్చే ప్రాధాన్య క్రమాన్ని కంపెనీ ఇప్పటికే నిర్ణయించింది. మొదట 50ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఇవ్వాలనుకున్నాం. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మా కంపెనీ 2020 సెప్టెంబర్ నుంచి ప్రతి ఉద్యోగికి నెలకు రెండు సార్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నాం.
-పంకజ్ లోచన్, జేఎస్పీఎల్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి.
మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ 55వేల ఉద్యోగులకు టీకా ఇవ్వడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. 2 లక్షల కొవిడ్ డోసుల కోసం తయారీ సంస్థలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ రెండు డోసులను ఇవ్వనుంది.
ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆర్ఐఎన్ఎల్, ఎస్ఏఐఎల్లు తమ ఉద్యోగుల వివరాలను కేంద్రానికి పంపించాయి. ఈ రెండు సంస్థలూ తమ సైట్లలో ఆసుపత్రులను నడుపుతున్నాయి.
మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేంద్రం, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలతో మా సంస్థ కలిసి పనిచేస్తోంది. ఝార్ఖండ్ జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్ (టీఎమ్‌హెచ్) రాష్ట్రంలోనే అతిపెద్ద కొవిడ్ కేర్ సెంటర్‌గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జనవరి 16 నుంచి టీఎమ్హెచ్లో టీకా పంపిణీ జరుగుతోంది.
-టాటా స్టీల్ ప్రతినిధి.
"మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఎక్కువ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు.. మా ఉద్యోగులకు కూడా టీకాలు ఇస్తాం. టాటా స్టీల్ ఎల్లప్పుడూ తన ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉంది" అని ప్రతినిధి చెప్పారు.
ఇదీ చదవండి: శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?