కరోనా భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఆందోళన. ఒక్క మనదేశంలోనే కాదు ఆ మహమ్మారి వైరస్ ఎక్కడి నుంచి ఎలా సోకుతుందోనని ప్రపంచమంతా భయమే. తుమ్మినా, దగ్గినా కరోనాయే కావచ్చనే అనుమానాలు. పరీక్షలు చేయించుకుని అపోహలు తీర్చుకుందామంటే ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి. కానీ, ఇకపై ప్రజలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా.. ఇంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది బెంగళూరులోని బయోన్ సంస్థ. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా 'రాపిడ్ కొవిడ్-19 హోం స్క్రీనింగ్' కిట్లను విడుదల చేసింది.

భారత సంస్థ సత్తా...
భారత జీవసాంకేతిక రంగంలో అత్యంత వేగంగా అద్భుతాలు సృష్టించే ఆరోగ్య సంస్థగా గుర్తింపు పొందింది బయోన్. 2019లో బెంగళురుకు చెందిన డాక్టర్ సురేంద్ర. కె. చికరా స్థాపించిన ఈ సంస్థ ఇప్పటికే ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంది. తాజాగా హోం కరోనా నిర్థరణ కిట్లను ఆవిష్కరించి ప్రపంచ మన్ననలు పొందుతోంది.
సులభంగా తెలుసుకో...
కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఈ రాపిడ్ కొవిడ్-19 హోం స్క్రీనింగ్ కిట్ల సాయంతో 5-10 నిమిషాల్లోనే ఫలితాలను పొందొచ్చు అంటోంది బయోన్. కిట్‌లో పొందుపరిచిన ఆల్కహాల్ రసాయనంతో వేళ్లను శుభ్రం చేసుకోవాలి. అందులోని ఓ సూదితో వేలిపై రక్తం బయటికొచ్చేలా గుచ్చాలి. రెండు చుక్కల రక్తపు నమూనాలను తీసుకుని కిట్‌లో కేటాయించిన స్థలంలో వేయాలి.
రూ.2-3 వేలు ఖరీదు చేసే ఈ కిట్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే కేవలం రెండు, మూడు రోజుల్లో ఇంటికి చేరుతుందంటోంది బయోన్.

"మేము కరోనా మహమ్మారిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతమైన సాధనాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం. కొవిడ్-19 హోమ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ ఇప్పుడున్న క్లిష్టకాలంలో అపూర్వమైన ఉత్పత్తిగా అవతరించింది. పరీక్షా కాలాన్ని తగ్గించి భారత్ మరింత వేగంగా కరోనాను జయించేందుకు ప్రయత్నిస్తున్నాం. వైరస్‌కు వ్యతిరేకంగా విప్లవాన్ని నడిపించడంలో ప్రభుత్వ మద్దతు కీలకమని మేము గట్టిగా నమ్ముతున్నాము."
-డాక్టర్ సురేంద్ర, బయోన్ స్థాపకుడు
ఇప్పటికే ఎన్నో నాణ్యతా పరీక్షలు పాసైన రాపిడ్ కొవిడ్-19 హోం స్క్రీనింగ్ కిట్‌ను.. మరికొన్ని పరీక్షలు నిర్వహించి వేగంగా మార్కెట్లోకి తీసుకురానుంది బయోన్. ప్రస్తుతం వారానికి 20 వేల కిట్లను ఉత్పత్తి చేస్తామని తెలిపింది.
అయితే ఇది కేవలం ఒక్కరిని పరీక్షించేందుకు మాత్రమే పని చేస్తుంది. ఒకే కిట్‌తో ఎంతమందినైనా పరీక్షించే కిట్లను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు బయోన్ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'