ఒడిశాలో బిజూ జనతాదల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి (65) ఇవాళ కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సెప్టెంబర్ 14న కొవిడ్ బారిన పడ్డారు ప్రదీప్. కరోనా నుంచి కోలుకున్న ఆయన.. మరో సారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు.
విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టి 1985లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ప్రదీప్. పూరీ జిల్లా పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు మంత్రిగా సేవలందించారు. 'నాతూ భాయి'గా ప్రజల ఆదరణ పొందారు.
ముఖ్యమంత్రి సంతాపం..
ప్రదీప్ మహారథి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ప్రదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: హాథ్రస్ బాధితురాలి కుటుంబం 5 డిమాండ్లు