బిహార్లో ఈసారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ భాజపా నుంచే ఉండనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్తో పాటే వారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తారకిశోర్, రేణుదేవీలను ఈ పదవులకు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చినట్లు తార కిశోర్ తెలిపారు. బిహార్ ఉప ముఖ్యమంత్రులగా తామిద్దరం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మహిళా శక్తి సాధనలో ఇదో గొప్ప ముందడుగు అని తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం తమకు అప్పగించిన పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని అన్నారు.
స్పీకర్ కూడా భాజపాకే..
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా తమ పార్టీకి చెందిన నాయకుడే ఉంటారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నితీశ్ కుమార్, భాజపా అగ్రనేతల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
ఆర్జేడీ గైర్హాజరు...
పట్నలో సమో సాయంత్రం జరిగే నితీశ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హాజరుకావడం లేదు. ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉంటున్నట్లు పార్టీ తెలిపింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 125 స్థానాల్లో గెలిచింది. భాజపా 74 సీట్లు కైవసం చేసుకుని జేడీయూ కంటే పెద్ద పార్టీగా అవతరించింది.