ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాసవాన్ మరణించటం, దాణా కుంభకోణంలో జైలుపాలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికలకు అందుబాటులో లేకపోటం వల్ల.. బిహార్ ఓటర్లకు ఎన్నికల సందడి కనిపించటం లేదు. గతంలో ఈ నేతల ప్రచారాలకు, ముఖ్యంగా లాలూ సభలకు జనాలు విరగబడి హాజరయ్యేవారు.
కరోనా విలయంలోనే జరుగుతున్న ఎన్నికలు కావటం వల్ల ప్రచారం, సభలు, సమావేశాలు, ఓటింగ్ విధానం అన్నీ మారిపోయాయి. వర్చువల్ వేదికల ద్వారానే ప్రచారం నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో ప్రచార హోరు, రోడ్‌షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు, నేతల వాగ్బాణాలు, ఓపెన్ ఛాలెంజ్‌లు, ఛలోక్తులు, ఫీట్లు, పాట్లను.. బిహారీ ఓటర్లు మిస్ అవుతున్నారు.
అస్తమించిన నేతలు
రాంవిలాస్ పాసవాన్ బిహార్ రాజకీయాల్లో దిగ్గజంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, అనారోగ్యంతో ఆయన అక్టోబర్ 8న తుదిశ్వాస విడిచి.. పార్టీని శోకసంద్రంలో ముంచారు.
ఆర్జేడీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ సైతం ఎన్నికలకు ముందే మరణించారు. లాలూకు సన్నిహితుడిగా ఉన్న ఆయన అనారోగ్యంతో సెప్టెంబర్ 13 దిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు.
కొవిడ్ నిబంధనలు
కొవిడ్ నిబంధనల వలన పార్టీల ప్రచారాలు కూడా డీలాపడ్డాయి. అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు... ప్రచారంలో అంత దూకుడుగా వ్యవహరించటం లేదు. చిన్నపార్టీలు గల్లీలకే పరిమితమవుతున్నాయి.
లాలూ లేని లోటు
లాలూ ప్రసాద్ ఆర్జేడీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండేవారు. ప్రతి ఎన్నికల్లో ప్రచార బాధ్యత తన భుజలపైనే మోసేవారు. ప్రజాకర్షక నేతగా.. బిహార్‌లో ఆయనకున్న ఛరిష్మా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి.. అనారోగ్యంతో రాంచీలోని రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఆయన ప్రచారం చేయలేని పరిస్థితి.
ఆర్జేడీ అవస్థలు
లాలూ అందుబాటులో లేకపోవటం ఆర్జేడీకి ఇబ్బందేననే మాట వినిపిస్తోంది. సొంత పార్టీలో సైతం లాలూ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
లాలూ ప్రజాకర్షక నేత. ఆయన ప్రచారాల్లో జనాలు భారీగా పోగయ్యేవారు. ఆయన మాటలు ఆసక్తిగా వినేవారు. తమ నేతగా ఆదరించేవారు.
-మృత్యుంజయ్ తివారి, ఆర్జేడీ నేత
ఇదీ చూడండి:'బిహార్ బరిలో లాలూ లేకపోవడం లోటే'
2015 ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున లాలూ 170, రఘువంశ్ ప్రసాద్ 100 ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. 2020 శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతల సేవలు కోల్పోవటం పార్టీపై ప్రభవం చూపనుంది.
మరికొంత మంది..
వీరితోపాటే మరికొంత మంది నేతలు.. ఈ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండనున్నారు.
- కేంద్ర మాజీ మంత్రి, లోక్తాంత్రిక్ జనతా దళ్ నేత శరద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల డిజిటల్ ప్రచారానికే పరిమితమవ్వనున్నారు.
- జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ వర్చువల్ ర్యాలీల్లో మాత్రమే కనిపించనున్నారు. దీంతో అధికార పార్టీ ప్రాచార బాధ్యత మొత్తం నితీశ్ కుమార్‌పైనే పడింది.
ఇదీ చూడండి: ఐశ్వర్యా రాయ్ భయంతో సీటు మార్చిన లాలూ తనయుడు!
ఇదీ చూడండి: బిహార్ బరి: కాంగ్రెస్‌పై మైనార్టీల గుస్సా- ఎందుకు ?