భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు పరిహారంగా అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్(యూసీసీ) అదనంగా రూ.7,844 కోట్లు ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ ఎంఆర్ సాహా, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వాదనలు విననుంది.
గతంలో రూ.715 కోట్లు!
భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారంగా గతంలో యూసీసీ రూ.715 కోట్లను ఇచ్చింది. అయితే వీటికి అదనంగా రూ.7,844 కోట్లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేంద్రం.
గ్యాస్ దుర్ఘటనలో అనారోగ్యం బారిన పడినవారు సరైన వైద్యం చేయించుకోవడాని, పరిహారం పొందడానికి చాలా కాలం పోరాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మెరుగైన పరిహారం కోసం కేంద్రం 2010లో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసింది.
భోపాల్ దుర్ఘటన
1984 డిసెంబర్లో జరిగిన భోపాల్ దుర్ఘటనలో మిథైల్ ఐసోసైనేట్ విషవాయువులు విడుదల కావడం వల్ల సుమారు 3000 మంది మృతి చెందగా, 1.02 లక్షల మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు.
ఇదీ చూడండి: పిటిషన్పై అత్యవసర విచారణకు నిర్భయ దోషి అభ్యర్థన