వయసు 107 ఏళ్లు. సరిగా మాట్లాడ లేరు. అయినా... ఓటు హక్కు వినియోగంలో మాత్రం అందరికన్నా ముందే. ఓటు విలువ తెలియచెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే ఈ పెద్దావిడ హరియాణాలోని రెవారి జిల్లాకు చెందినవారు.
బోకా గ్రామానికి చెందిన 107 ఏళ్ల మాయా కౌర్.. నెహ్రూ కాలం నుంచి మోదీ వరకు... ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భర్త సైన్యంలో పనిచేసి దేశ రక్షణకు పాటుపడగా ఈమె ఓటు విలువ తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామంలో వారందరికీ ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
మా తల్లి స్వాతంత్ర్యం, రాచరిక పాలనలను చూశారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయటానికి ఎంత పట్టుదలతో ఉన్నారో ఇప్పటికే అంతే పట్టుదలతో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెబుతూ.. ప్రజలను చైతన్య పరుస్తుంటారు. మీరు ఓటేయండి, అందరినీ ఓటేసేలా చేయండి అని చెబుతుంటారు. గ్రామంలోనూ తిరుగుతుంటారు. ఇద్దరు, ముగ్గురు గుమిగూడిన దగ్గరకు వెళ్లి... వాళ్లకు అర్థమయ్యేలా చెబుతారు.
- కర్తార్ సింగ్, మాయా కౌర్ కుమారుడు