జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. నిర్బంధం నుంచి శుక్రవారం విడుదలైన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను కలిశారు ఆజాద్. శ్రీనగర్ గుప్కార్ ప్రాంతంలోని ఆయన నివాసానికి వెళ్లి సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
ఏడు నెలల తర్వాత ఫరూఖ్‌ను కలవటం సంతోషంగా ఉందన్నారు ఆజాద్. ఆయనను నిర్బంధించడానికి సరైన కారణాలు ఇంకా తెలియవన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఏదైన రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలంటే.. ముందుగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఆజాద్. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా ఇతర నేతలందరినీ విడుదల చేయాలన్నారు.
"జమ్ముకశ్మీర్‌లోని నాయకులు, వారి అనుచరులు, కార్యకర్తలను నిర్బంధించటం సరికాదు. నేతలందరినీ విడుదల చేయాలి. వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని జమ్ముకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నారు."
- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
నేతలందరూ నిర్బంధంలో ఉన్నప్పటికీ.. అందరి తరఫున పార్లమెంటు ఉభయ సభల్లో తమ గొంతును వినిపించామన్నారు ఆజాద్. జమ్ముకశ్మీర్‌లో మూడేళ్ల నుంచి అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యటకం, రవాణా వ్యవస్థ, వ్యాపారాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒమర్ అద్దుల్లాతో ఫరూక్ భేటీ..
నిర్బంధం నుంచి విడుదలైన ఫరూఖ్ అబ్దుల్లా.. నేడు శ్రీనగర్‌లోని సబ్‌జైలుకు వెళ్లి ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కలిశారు. సుమారు గంటపాటు ఆయనతో మాట్లాడారు. ఏడు నెలల తర్వాత విడుదలైన సందర్భంగా.. ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్న తన కొడుకును కలవాలని జమ్ముకశ్మీర్ అధికారులను కోరగా అనుమతించారు.
ఏడు నెలలుగా..
2019, ఆగస్టు 5న అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ నేతలను నిర్బంధంలోకి తీసుకుంది. సుమారు ఏడు నెలలుగా ముఖ్యనేతలు, కార్యకర్తలు నిర్బంధంలోనే ఉన్నారు. ప్రస్తుతం ప్రజారక్షణ చట్టాన్ని ఎత్తివేసిన క్రమంలో ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేశారు.
ఇదీ చూడండి: 220 రోజుల తర్వాత ఫరూఖ్ అబ్దుల్లాకు 'స్వేచ్ఛ'