రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో దేశంలో లౌకికవాదం బలపడుతుందా? చరిత్రలో ఎప్పుడో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలంటూ ప్రార్థనా స్థలాలపై వివాదాలకు పోకుండా రాజకీయపక్షాలు, సంస్థలు ఇకనైనా నడచుకుంటాయా? మూడు దశాబ్దాల అపనమ్మకాలు, అపోహల చరిత్ర క్రమేపీ కనుమరుగవుతుందా? సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరవాత పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలు ఏ వైపు నుంచి రాకపోవడంతో ఈ ప్రశ్నలు చాలామందిలో ఉదయించాయి.
సర్వోన్నత న్యాయస్థానం తన 1,100 పేజీల తీర్పులో లౌకికవాదం గురించి చాలా విషయాలు ప్రస్తావించింది. భవిష్యత్తులో ప్రార్థనాలయాలపై వివాదాలు తలెత్తకుండా ఉండటానికి వీలుగా కొన్ని కీలక విషయాలను స్పష్టంచేసింది. మధ్యయుగాల నాడు తమ ప్రార్థనాస్థలం విషయంలో అన్యాయం జరిగిందనో, లేక దాన్ని వేరే మతానికి చెందిన వారు ఆక్రమించారనే ఆరోపణలతో ఏ విధమైన బలవంతపు చర్యలకు ఒడిగట్టినా అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమేనని తేల్చిచెప్పింది.
బాబ్రీమసీదును కూల్చివేయడాన్ని తాత్కాలిక ఆవేశంతో చేసిన చర్యగా భావించలేదు. పనిగట్టుకుని కూల్చివేసిన ఘటనగానే చూసింది. న్యాయస్థానాల్లో కేసులు పెండింగులో ఉండగా 450 ఏళ్ల క్రితం నిర్మాణమైన ప్రార్థనాలయం నుంచి బలవంతంగా ముస్లిములను గెంటివేయడంగానే దాన్ని వ్యాఖ్యానించింది. సమన్యాయ పాలనకు కట్టుబడ్డ లౌకికవాద దేశంలో అలా జరిగి ఉండకూడదనీ స్పష్టీకరించింది. ఈ కారణంగానే వారికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వకపోతే న్యాయం జరిగినట్లుగా భావించలేమని తీర్పులో వ్యాఖ్యానించింది.
సాక్ష్యాధారాలే గీటురాయి....
లౌకికవాదాన్ని చులకనచేస్తూ, దాన్ని పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామంటూ విమర్శలు చేసే ఒక వర్గం దేశంలో ఎప్పటినుంచో ఉంది. తాముంటున్న దేశాన్ని కర్మభూమిగా మాత్రమేగాక పుణ్యభూమిగా భావించనివారు... పుణ్యస్థలం కోసం మరో భూభాగం వైపు చూసేవారు జాతి సంస్కృతిలో ఎన్నటికీ భాగం కాలేరన్న విచిత్ర వాదన 1920ల నుంచి ఉంది.
ఇటీవల మూడు దశాబ్దాల్లో అది బాగా బలపడింది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి జీవించడం, వాటి ప్రకారం రాజకీయ ఆలోచనలు కలిగిఉండటం సరిపోదనేవారూ ఉన్నారు. తరతరాలుగా ఉన్న సంస్కృతి నుంచి స్ఫూర్తిపొందకుండా జాతీయతా భావం తలెత్తదనీ గట్టిగా విశ్వసించే ఆలోచనాపరుల సంఖ్యా తక్కువేమి కాదు. ఇక రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదం దేశవ్యాప్తంగా వాదోపవాదాలకు దారితీసిన తరవాత అసలు ఏది లౌకికవాదం అన్న అంశంపై పెద్దయెత్తునే చర్చలు మొదలయ్యాయి. కుహనా లౌకికవాదం అనే పదం రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం సంపాదించుకుంది.
1,500 గజాల వివాదాస్పద భూమిపై హక్కులు ఎవరికి ఇవ్వాలన్నది తేల్చడానికి విశ్వాసం, నమ్మకాలను ప్రాతిపదికగా తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పులో పలుచోట్ల స్పష్టంచేసింది. లౌకికవాదం, సమన్యాయపాలన, చట్టబద్ధ సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పునిచ్చామని పేర్కొంది. మందిర్- మసీదు వివాదం దేశాన్ని రాజకీయంగా కుదిపేయడమే కాదు, లౌకికవాదాన్ని ఒడుదొడుకులకు గురిచేసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లౌకిక వాదం గురించి లోతైన వివరణలు, వ్యాఖ్యలు చేసింది. లౌకిక వాదాన్ని ఎవరికి వారు ఆచరించే ఒక నీతిగా, ఒక దృక్పథంగా సుప్రీంకోర్టు చూడలేదు.
అన్ని మతాలను సమదృష్టితో చూడటం లౌకికవాదానికి ప్రాణమని చెప్పడమే కాదు- రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అదొక భాగమనీ వ్యాఖ్యానించింది. పైగా దాన్ని అనుల్లంఘనీయ రాజ్యాంగసూత్రంగా పేర్కొంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌరులు లౌకికవాదానికి కట్టుబడాల్సిందేని స్పష్టంచేసింది. బొమ్మై కేసు విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులో లౌకికవాదంపై జస్టిస్ జీవన్‌రెడ్డి విస్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. మతసహనానికి సంబంధించి మనమానాన మనం ఉండే ఒక ఉదాసీన వైఖరిగా లౌకికవాదాన్ని అర్థంచేసుకోకూడదని ఆనాడు జస్టిస్ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మనం సాధించాల్సిన, పాటించాల్సిన మహోన్నత రాజ్యాంగ లక్ష్యంగా లౌకికవాదాన్ని వర్ణించడమే కాదు... రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అది అంతర్భాగమని ఆనాడు జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. దానికి వ్యతిరేకంగా ఎవరు ఏ అడుగు వేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమేనని అప్పట్లో జస్టిస్ జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.
భవిష్యత్తులో ప్రార్థనాస్థలాలపై వివాదాలు తలెత్తకుండా ఉండటానికి బాబ్రీమసీదు విధ్వంసానికి ముందు 1991లో తీసుకొచ్చిన ప్రార్థనాస్థలాల చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పులో పలుమార్లు ప్రస్తావించింది. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని మార్చకుండా నిషేధం విధిస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. తమ ప్రార్థనా స్థలాన్ని వేరే మతంవారు ఆక్రమించారనీ ఇప్పుడు దానికి బదులుతీర్చుకుంటామని ఎవరు ప్రయత్నించినా, ఆ దిశగా ఏ చర్యలు చేపట్టినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
న్యాయస్థానాలూ ప్రార్థనాస్థలాల స్వభావాన్ని మార్చే ఏ కేసునూ చేపట్టకుండా ఆ చట్టం నిషేధించింది. రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును మాత్రం ఈ చట్టం నుంచి మినహాయించారు. రాజ్యాంగ మౌలిక విలువైన లౌకికవాదాన్ని రక్షించడానికే ఆ చట్టాన్ని పార్లమెంటు చేసిందని నొక్కి మరీ చెప్పారు. దాన్ని ఎవరూ జవదాటకూడదని ధర్మాసనం స్పష్టీకరించింది. 1947 ఆగస్టు 15నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలు, నిర్మాణాలను కాపాడటం అన్ని స్థాయుల్లోని ప్రభుత్వాలపై ఉందని, 1991 నాటి చట్టం ఆ విధంగా నిర్దేశిస్తోందని చెప్పింది.
విశ్వాసం పునాది కాదు....
నమ్మకం, విశ్వాసం అనేవి మెజారిటీ ప్రజలవైనా, మైనారిటీ ప్రజలవైనా వాటి ఆధారంగా ఒక స్థలంపై యాజమాన్య హక్కును న్యాయస్థానం నిర్ణయించలేదు. వివాదస్పద స్థలం విషయంలో చట్టబద్ధంగా సుస్థిరమైన నియమాల ప్రకారమే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. ముస్లిముల పక్షాన వాదించిన న్యాయవాదులతో పాటు పలువురు మేధావులు నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వకూడదని వ్యాఖ్యలు, విజ్ఞప్తులు చేశారు. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే తీర్పునకు ప్రాతిపదికను వీలైనచోటల్లా విశదీకరించారు.
బాబ్రీమసీదు అస్తిత్వాన్ని కోర్టు తోసిపుచ్చలేదు. వివాదస్పద కట్టడంలోని ప్రధాన గుమ్మటంలో 1949 డిసెంబరులో హిందూ విగ్రహాలను పెట్టడాన్ని కాదనలేదు. ముస్లిములు అక్కడ 1949 డిసెంబరు 16 వరకూ ప్రార్థనలు చేసిన విషయాన్ని అంగీకరించింది. హిందూ విగ్రహాలను ప్రధానగుమ్మటంలో పెట్టిన తరవాత నమాజు చేయడం ఆగిపోయిందనీ ప్రస్తావించింది.
అయితే మసీదును కట్టిననాటి నుంచి 1857కి పూర్వం మూడు గుమ్మటాలున్న ప్రధాన కట్టడం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్న విషయాన్ని ముస్లిములు నిరూపించలేకపోయారు. ఆవద్ సంస్థానం 1856లో బ్రిటీష్ పాలన కిందకు వచ్చింది. ప్రధాన కట్టడం ఉన్న ప్రాంతంలో 1857కు ముందుకూడా హిందువులు అక్కడ పూజలు చేసేవారని సాక్ష్యాధారాలు తెలుపుతున్నాయని పేర్కొంది. హిందువులు-ముస్లిముల మధ్య గొడవలు నివారించడానికి 1857లో 1,500 గజాల స్థలం మధ్యలో ఇటుకలు-ఇనుప కడ్డీలతో బ్రిటీషు అధికారులు ఒక గోడ కట్టారు.
అయినా ప్రధాన కట్టడం ఉన్న ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమిగా భావించడం మానలేదు. మిగతా సగభాగంలో హిందువులు వివిధ స్థలాల్లో నిరంతరం పూజలు చేస్తూనే ఉన్నారు. బ్రిటీషు అధికారులు అడ్డుగోడను కట్టినా ప్రధాన గుమ్మటం ఉన్న ప్రాంతాన్ని గర్భగుడిగా విశ్వసించడాన్ని మానకపోవడమే కాదు- అక్కడకు వెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. 1877లోనే హిందువుల కోరిక మేరకు వారి ఆధీనంలో ఉన్న భూభాగంలోకి ప్రవేశానికి రెండో ద్వారాన్నీ ఏర్పాటుచేశారు. శ్రీరామనవమి, కార్తిక పౌర్ణమి తదితర పుణ్యదినాల్లో భక్తులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చేవారు. ప్రధాన కట్టడం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు.
హిందూ-ముస్లిముల సాక్షులూ వీటిని ధ్రువీకరించారు. విదేశీయాత్రికుల అయోధ్య గురించి తెలిపిన సమాచారంలోనూ ఈ విషయాలున్నాయి. ప్రభుత్వ గెజెట్లూ దాన్నే నిర్ధారించాయి.
400 ఏళ్లలో ఏం జరిగింది?
పురావస్తుశాఖ తవ్వకాలు జరిపి ఇచ్చిన నివేదికలో 12వ శతాబ్దినాటి హిందూ మత చిహ్నాలున్న కట్టడం మసీదు కింది భాగాన ఉందని పేర్కొంది. ఆ కట్టడం గోడలపై మసీదు పునాదులు వేశారనీ పురావస్తుశాఖ నివేదించింది. ఆ నివేదిక కొన్ని కీలక విషయాలను ప్రస్తావించని సంగతిని ధర్మాసనం గుర్తించింది. హిందూ ఆలయాన్ని పోలిన నిర్మాణం అడుగున ఉందని చెప్పింది కానీ, అదెందుకు ధ్వంసమైందీ వివరించలేదు. మసీదు కోసం దాన్ని ధ్వంసం చేశారా అన్న ప్రశ్నకు జవాబివ్వలేదు.
మసీదు అడుగు భాగాన ఉన్న నిర్మాణం 12వ శతాబ్ది నాటిది. మసీదు ఏమో 16వ శతాబ్దంలో కట్టారు. రెండింటికి మధ్య నాలుగు శతాబ్దాల అంతరం ఉంది. ఆ నాలుగొందల ఏళ్లల్లో ఏం జరిగిందో నివేదిక చెప్పలేదు. మసీదు కోసం హిందూ చిహ్నాలున్న కట్టడం తాలూకూ నిర్మాణాలను వాడుకున్నారని కూడా నివేదిక ఒక నిర్ణయానికి రాలేదు. మసీదుకు నలుపురంగులో కసౌతి రాతి స్తంభాలను వాడారని చెప్పింది కానీ అవి హిందూ కట్టడానికి చెందినవిగా పేర్కొనలేదు.
మొత్తంమీద 1857కి ముందు కూడా ప్రధాన గుమ్మటంలో హిందువులు పూజలుచేసిన సాక్ష్యాధారాలను, దాన్ని రామజన్మ భూమిగా భావించిన పలు దృష్టాంతాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరోవైపు ముస్లిముల మనోభావాలు గాయపడకుండా వారికి జరిగిన అన్యాయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. మసీదు కూల్చివేత విషయంలో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
న్యాయస్థానం ఆశించిన రీతిలో లౌకికవాదానికి కట్టుబడి 1991 చట్టం ప్రకారం ప్రార్థన స్థలాలను ప్రభుత్వాలు కాపాడితే బహుళ సంస్కృతుల ప్రజాస్వామ్యం పది కాలలపాటు పదిలంగా ఉంటుంది. మూడున్నర దశాబ్దాల వైషమ్య మనోభావాలు మసకబారిపోతాయి.
-ఎన్ రాహుల్ కుమార్.
ఇదీ చూడండి:దిల్లీలో భూప్రకంపనలు... భయంతో జనం పరుగులు