ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలం చట్టబద్ధతపై ముస్లిం వర్గాల మధ్య తాజాగా వివాదం రాజుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు సందర్భంగా వివాదాస్పద ప్రాంతం రామ జన్మభూమికి చెందినదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో నూతన మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ధన్నిపుర్లో ఐదెకరాలను కేటాయించింది. ఆ స్థలంలో మసీదు నిర్మాణం కోసం సన్నాహాలు సాగుతున్నాయి.
అయితే.. వక్ఫ్ చట్టం, షరియత్ నియమాల ప్రకారం.. అక్కడ మసీదు నిర్మించడం అక్రమమంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, న్యాయవాది జఫర్యబ్ జిలానీ వ్యాఖ్యానించారు. 'వక్ఫ్‌బోర్డ్ ప్రకారం మసీదును నిర్మించే స్థలం ఒక ఆస్తికి 'బదులుగా' దక్కి ఉండకూడదు. అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణం దీన్ని ఉల్లంఘిస్తోంది. వక్ఫ్ చట్టం షరియత్ నియమాల ఆధారంగా రూపొందింది. ఈ మసీదు విషయంలో షరియత్ నియమాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి.' అని ఒకప్పటి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జిలానీ పేర్కొన్నారు.
జిలానీ వాదనను సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు జుఫర్ ఫరూఖి ఖండించారు. మసీదును నిర్మించబోయే స్థలం 'బదులుగా' దక్కింది కాదన్నారు. 'సుప్రీం తీర్పు ఆధారంగా ధన్నిపుర్లోని స్థలాన్ని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించారు. దాన్ని సొంతం చేసుకోవడానికి బోర్డు రూ.9,29,400 స్టాంపు డ్యూటీని చెల్లించింది. అది వక్ఫ్ బోర్డ్ ఆస్తి' అని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: అయోధ్య మసీదు ఆకృతి విడుదల