అయోధ్య భూ వివాదం కేసుపై నేడు సుప్రీంకోర్టులో ఐదోరోజు విచారణ జరగనుంది. ఆగస్టు 6 నుంచి ఈ అంశంపై రోజువారీ వాదనలు వింటోంది అత్యున్నత న్యాయస్థానం. మూడు రోజుల విరామం అనంతరం రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై నేడు వాదనలు కొనసాగించనుంది. హిందూ సంస్థ రామ్‌లల్లా తరపున సీనియర్ న్యాయవాది పరాశరన్ వాదనలు వినిపించనున్నారు.
అయోధ్య రాముని జన్మస్థలమేనని అందులో ఎలాంటి సందేహం లేదని ఇదివరకే కోర్టుకు తెలిపారు పరాశరన్. మరోవైపు అయోధ్య భూ వివాదంపై రోజువారీ విచారణ చేయాలన్న సుప్రీం నిర్ణయాన్ని ముస్లిం వర్గాల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. అయన అభ్యర్థనను తిరస్కరించింది న్యాయస్థానం. రోజువారీ విచారణలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
ఇదీ వివాదం...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఎవరైనా ఉన్నారా?
రఘువంశానికి చెందిన వారు అయోధ్యలో ఇప్పటికీ ఎవరైనా నివసిస్తున్నారా? అని హిందూ సంస్థ రామ్‌లల్లా తరపు న్యాయవాది పరాశరన్‌ను గత శుక్రవారం ప్రశ్నించింది కోర్టు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి ప్రశ్నకు పరాశరన్ ఇంకా సమాధానమివ్వలేదు.
అయితే, తాము రాముని కుమారుడు కుశుడి వారసులమని రాజస్థాన్ భాజపా ఎంపీ దియాకుమారి ఆదివారం స్పందించారు.
" శ్రీరాముని వారసులు ఎక్కడ ఉన్నారు అని కోర్టు ప్రశ్నించింది. కుశుడి వారసులమైన మాతో పాటు ప్రపంచ నలుమూలలా రాముని కుటుంబీకులు ఉన్నారు. "
- దియా కుమారి, భాజపా ఎంపీ