అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా సున్నితమైన అయోధ్య విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కేంద్ర మంత్రులకు సూచించారు. దేశంలో సామరస్యాన్ని కొనసాగించేలా కృషి చేయాలని తెలిపారు.
బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. దేశంలో స్నేహపూర్వక, సామరస్య వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సుప్రీం తీర్పును విజయం, అపజయం అనే కోణంలో చూడకూడదన్నారు.
పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు రామ మందిరం సమస్యపై ఉద్వేగభరిత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని.. పార్టీ ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా కృషి చేయాలని పేర్కొంది భాజపా. పార్టీ సూచనలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికార భాజపా సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి హెచ్చరికలే చేసింది.
17 లోపు తీర్పు..
40 రోజుల పాటు రోజూవారీ విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది. గొగొయి ఈనెల 17న పదవి విరమణ చేసే లోపు తీర్పు వెలువరించనున్నారు.
ఇదీ చూడండి: 'అయోధ్యలో 16వేల మంది వలంటీర్లు'