గుజరాత్‌కు చెందిన సిద్ధి పటేల్ అనే బాలిక అరుదైన ఘనత సాధించింది. 11 ఏళ్ల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. సూరత్ నుంచి అతి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన బాలికగా నిలిచింది. ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.
పిరమిడ్ నిర్మాణం..
ప్లాస్టిక్ గ్లాసులతో 23 అంతస్తుల పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టాలనుకుంది సిద్ధి. ఈ క్రమంలోనే 15వ అంతస్తు పూర్తి చేస్తుండగా గ్లాసులు పడిపోతున్నాయి. ఎన్ని సార్లు ప్రయత్నించినా అలాగే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం చేసింది సిద్ధి. ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత తన శ్వాస నుంచి వచ్చే గాలి వల్ల గ్లాసులు పడిపోవటాన్ని గుర్తించింది. దీంతో శ్వాసను అదుపులో ఉంచుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం ప్రాణయామంపై అధ్యయనం చేసి చివరకు పిరమిడ్‌ను పూర్తి చేసింది.
ఏప్రిల్ నెలలో గుజరాత్ ప్రభుత్వం 'స్టే హోం స్టే సేఫ్', ' రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ఎలా?' అనే కొవిడ్-19కు చెందిన రెండు అంశాలపై 'టూ మినిట్స్ ఇన్నోవేటివ్ వీడియో కాంపిటిషన్'ను నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న సిద్ధి ఈ రెండు అంశాలపై తన ప్రదర్శననిచ్చింది. దీనిలో సిద్ధి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.