దేశంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి చికిత్స అందించే నిర్బంధ కేంద్రాలు చాలా అధ్వానంగా ఉన్నాయని మాట్లాడినందుకు అసోంకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు.
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్) పార్టీ నుంచి ధింగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అమినుల్. ప్రాథమిక విచారణ అనంతరం సదరు ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ భాస్కర్జ్యోతి మహంత తెలిపారు.
ఎమ్మెల్యే అమినుల్ మరొక వ్యక్తితో నిర్బంధ కేంద్రాల గురించి అవమానకరంగా ఫోన్లో సంభాషించిన ఆడియోను సామాజిక మాధ్యమాల్లో గుర్తించినట్లు తెలిపారు. నిర్బంధ కేంద్రాల్లోని చికిత్స పొందుతున్న వారి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని మాట్లాడినందున ఐపీసీ సెక్షన్ నేర పూరిత చర్య కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.