అసోంలో వరదల ఉద్ధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఆదివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 18కి చేరింది. వరదల ధాటికి 23 జిల్లాల్లో మొత్తం 9,26,059 మంది ప్రభావితమైనట్లు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
బర్‌పేట జిల్లాలో అధికంగా 1.30 లక్షల మందిని వరదలు అతలాకుతలం చేశాయి. వివిధ గ్రామాల్లోని 69 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. 15 లక్షలకుపైగా మూగ జీవాలు వరదల ధాటికి అల్లాడిపోతున్నాయని పేర్కొన్నారు. పాడిరంగంపై వరదల ప్రభావం అధికంగా పడిందని తెలిపారు.
అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ బగ్‌జన్ గ్యాస్ బావిలో.. గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న మంటలను అదుపుచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు.. వరద ప్రవాహం అధికమవడం వల్ల విఫలమయ్యాయి.
మరోవైపు.. సిక్కింలో భారీ వర్షాలకు అకస్మాత్తుగా సంభవించిన వరద ధాటికి 19 ఇళ్లు దెబ్బతిన్నాయి. 35 కుటుంబాలపై ప్రభావం పడింది.
ఇదీ చూడండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు