పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ శాసనసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రసంగించారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్. ప్రభుత్వం అందజేసిన ఈ ప్రసంగం సీఏఏకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో.. ఆరిఫ్ అసాధారణ రీతిలో వ్యవహరించారు.
ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన రాగానే.. తనకు ఇష్టం లేకపోయినా సీఎం రాసిచ్చారనే ఈ మాటలు చదువుతున్నానని గవర్నర్ ఆరిఫ్ పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రి చెప్పారని ఈ పేరా చదువుతున్నాను. ఇది ప్రభుత్వ విధానాలకు సంబంధించినది కాదని తెలుసు. కానీ ఇదే ప్రభుత్వ అభిప్రాయమని సీఎం విజయన్ చెప్పారు. నాకు ఇష్టం లేకపోయినా ఆయన కోరికను గౌరవించి ఈ పేరాను చదువుతున్నా.
పౌరసత్వాన్ని మత ఆధారితంగా ఇవ్వటం సరైనదికాదు. రాజ్యాంగ మౌలిక సూత్రమైన లౌకికవాదాన్ని ఇది విస్మరిస్తుంది. ఈ మేరకు సీఏఏ-2019ను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం."
-ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్
అనూహ్య పరిణామాలు..
అంతకుముందు కేరళ అసెంబ్లీలో ఆరిఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సభకు రాగానే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సీఏఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు సభ నుంచి వెనక్కువెళ్లిపోవాలంటూ అడ్డుతగిలారు. సీఏఏను వెనక్కి తీసుకోవాలంటూ బ్యానర్లను ప్రదర్శించారు.
కేరళ సీఎం పినరయి విజయన్, స్పీకర్ శ్రీరామకృష్ణన్.. ఎన్నిసార్లు విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. మార్షల్స్ రక్షణగా నిలిచి కుర్చీ వరకు గవర్నర్‌ను తీసుకెళ్లారు. తర్వాత గవర్నర్ ఆరిఫ్ ప్రసంగం ప్రారంభించగానే యూడీఎఫ్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.