జమ్ముకశ్మీర్‌లో పర్యటించడానికి మరో విదేశీ బృందం సన్నద్ధమవుతోంది. ఐరోపా సమాఖ్య, గల్ఫ్ దేశాలకు చెందిన రాయబారుల బృందం.. నేటి నుంచి రెండురోజుల పాటు కశ్మీర్లో పర్యటించనుంది. ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిస్థితులను సమీక్షించనుంది. పౌరసమాజం, భద్రతా సిబ్బంది, నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలతో బృందంలోని ప్రతినిధులు సమావేశం కానున్నారు. పౌరసత్వ చట్ట సవరణ, కశ్మీర్ అంశంపై గత నెలలో ఈయూ పార్లమెంట్లో జరిగిన చర్చపై ఓటింగ్ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కశ్మీర్లో పర్యటించాలని విదేశీ బృందాన్ని భారత ప్రభుత్వం ముందే కోరింది. కానీ ఈ విషయంపై చర్చించాలంటూ కశ్మీర్ పర్యటన విజ్ఞప్తిని తిరస్కరించారు రాయబారులు.
ఇప్పటివరకు...
ఇంతకుముందే ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది ఎంపీలు కశ్మీర్‌ను సందర్శించారు. అయితే నాటి పర్యటనపై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్-అలైన్డ్ స్టడీస్ విమర్శలు చేసింది. కేవలం ఒక వర్గం వారినే ప్రభుత్వం ఈ పర్యటనకు ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతినిధుల పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంది. ఐరోపా సమాఖ్య పార్లమెంట్ సభ్యుల పర్యటన వారి వ్యక్తిగతమైనదని వెల్లడించింది.
ఇదీ చూడండి: జీరో ఎఫెక్ట్: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా