దిల్లీలో నిరసన చేస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించకపోతే జన ఆందోళన ప్రారంభిస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే.. కేంద్రాన్ని హెచ్చరించారు. లోక్పాల్ బిల్లు కోసం చేసినట్టుగానే నిరసన చేపడతానని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలను దేశంలో అనుమతించరని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా అమలు చేస్తే.. దానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం సరైనదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"లోక్పాల్ ఆందోళనల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయింది. రైతుల నిరసనలను కూడా నేను ఇదే కోణంలో చూస్తున్నా. భారత్ బంద్ రోజున నా గ్రామంలో ఆందోళన నిర్వహించా. రైతుల కోసం రోజంతా నిరాహార దీక్ష చేశా. ఒకవేళ రైతుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. లోక్పాల్ నిరసనల తరహాలోనే మరోసారి జన ఆందోళన నిర్వహిస్తా."
-అన్నా హజారే, సామాజిక కార్యకర్త
అదేసమయంలో నిరసన చేస్తున్న రైతులు అహింసా మార్గాన్ని అనుసరించాలని కోరారు అన్నా హజారే. శాంతియుతంగా ఉద్యమించాలని అభ్యర్థించారు. మహాత్మా గాంధీ బోధనలను పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!