సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన(1920-21)కు సహకరించడానికి మహాత్మాగాంధీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రజలు కూడా సహకరించాలని అప్పట్లో ఆయన రాసిన వ్యాసంలో సూచించారు. వాస్తవానికి ఈ కార్యక్రమం స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని జాతిపిత భావించారు. తాజా జనగణన సందర్భంగా గాంధీజీ అభిప్రాయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని గుజరాత్ జనాభా లెక్కల విభాగం అన్నీ రాష్ట్రాలకు గతంలో సూచించింది. జనగణకులు ఇంటికి వచ్చి అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక తమకు లేదని కొందరు అంటున్నారని, వారు ఈ కార్యక్రమానికి సహకరించడం చాలా ముఖ్యమని గుర్తుచేసేందుకు గాంధీజీ మాటలను ప్రచారం చేయాలని సూచించింది. తిరిగి ఇప్పుడు జనగణనలో ‘జాతీయ జనాభా పట్టిక’(ఎన్‌పీఆర్) నమోదుకు సహకరించేది లేదని ఇప్పటికే అరడజను రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఈ పట్టికలోని అంశాలపై కొందరు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగణన సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.
దేశాభివృద్ధికి కీలకం!
జనగణన అనేది దేశ ప్రజల అభివృద్ధికి, పాలన విధానాల రూపకల్పనకు అత్యంత ముఖ్యమని అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం పెద్దయెత్తున వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారం చేస్తోంది. ‘2020 జనాభా లెక్కల సేకరణ... మీ భవిష్యత్తు ఇక్కడి నుంచే రూపుదిద్దుకోండి’ అనే నినాదంతో అమెరికాలో ఆన్‌లైన్‌లో ఇప్పటికే అధికారికంగా ప్రచారం చేస్తున్నారు. మనదేశంలో మాదిరిగా అక్కడా పదేళ్లకోమారు జరిగే జనగణన 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభమవనుంది. ఇందులో పాల్గొనాలని ప్రతి అమెరికా పౌరుడిని కోరుతూ ఊరూరా ప్రచారం చేస్తోంది. భారత్‌లోనూ ఏప్రిల్ నుంచి జనగణన ప్రారంభం కాబోతున్న తరుణంలో దానికి సహకరించవద్దని ఏకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే శాసనసభల్లో తీర్మానాలు చేస్తున్నాయి. మనదేశంలో ఇప్పటికే అనేక పథకాలు, పాలన విధానాల అమలుతీరు సక్రమంగా లేక పేదలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు. దానివల్ల దారిద్య్ర రేఖను దాటి వారు బయటికి రాలేకపోతున్నారు. ప్రస్తుతం దేశ జనాభా 130 కోట్లు దాటింది. 2060నాటికి ఈ సంఖ్య 175 కోట్లకు చేరుతుందని, ఆ రకంగా మనదేశం జనాభాపరంగా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుందని అంచనా.
ప్రతి పైసా సద్వినియోగం కావాలంటే..!
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాభా దేశమైనందున భారత్‌లో జనగణనకు ఎంతో ప్రాధాన్యముంది. పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం జనాభా లెక్కల సేకరణను కీలకంగా భావిస్తున్నాయి. ప్రభుత్వాలు వెచ్చించే ప్రజాధనంలో ప్రతి పైసా సద్వినియోగం కావాలంటే జనగణనలో వెల్లడయ్యే గణాంకాలే కీలక ఆధారం. ఇవి సరిగ్గా లేకపోతే దేశ ప్రగతికి అవరోధం ఏర్పడుతుంది. ఉదాహరణకు 1971-81 మధ్యకాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కుటుంబ నియంత్రణ(కు.ని.) కార్యక్రమాలను పెద్దయెత్తున అమలుచేసింది. దీనివల్ల జనాభా వృద్ధి రేటు తగ్గుతుందని, సంక్షేమ పథకాలను మరింత ఎక్కువగా అమలు చేయవచ్చని ప్రభుత్వం ఆశించింది. కానీ, 1981లో వెల్లడైన కొత్త జనాభా లెక్కలను చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆశ్చర్యపోయారు. 1971-81 మధ్యకాలంలో దేశ జనాభా దశాబ్ది వృద్ధిరేటు 24.7గా నమోదైంది. అంతకుముందు దశాబ్దిలో నమోదైన వృద్ధిరేటు 24.8 కన్నా ఏమాత్రం తగ్గకపోవడం కుటుంబ నియంత్రణ కార్యక్రమాల వైఫల్యాలను జనగణన ఎండగట్టింది. కు.ని.కార్యక్రమాలను సమూలంగా ప్రక్షాళించాల్సిన అవసరముందని జనగణనతో వెల్లడైందని ఇందిర వెల్లడించారు. అంతకుముందు దశాబ్దికన్నా జనాభా ఏకంగా 13.51 కోట్లు అదనంగా పెరిగింది. ఇది నాటి ఆస్ట్రేలియా జనాభాకన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ. అప్పుడు కేవలం 1.40 కోట్లుగా ఉన్న ఆస్ట్రేలియా జనాభా ఆదాయం 1981లో భారత జనాభా 68.40 కోట్ల మంది ఆదాయానికి సమానమని ఇందిర చెప్పారు. ఇప్పటికి దేశంలో 15సార్లు జనగణన జరిగింది.
అప్పుడు తొమ్మిదే!
తొలుత 1872లో దేశంలో బ్రిటిష్ పాలకులు జనాభా లెక్కలు సేకరించారు. అప్పుడు ‘ఇంటి నమోదు పట్టిక’ పేరిట ప్రతి ఒక్కరి నుంచి తొమ్మిది ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. ప్రతి వ్యక్తిని మీకు ఎన్ని ఇళ్లు ఉన్నాయి, మీ ఇంటిలో ఎందరు మగవారున్నారు, వారి పేరు, మతం, కులం, జాతీయత వివరాలతోపాటు కుష్టు, బుద్ధిమాంద్యం గలవారి గురించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. 2001, 2011లో జరిగిన జనగణనలో కుటుంబ వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి కుటుంబ వివరాలతో పాటు, ప్రతి కుటుంబానికి విడిగా ‘జాతీయ జనాభా పట్టిక’(ఎన్‌పీఆర్)ను ప్రవేశపెట్టింది. ఆ తరవాత 2015లో జనాభాలోని వివిధ వర్గాల వివరాలను సేకరించి వాటిని పట్టికలో పొందుపరిచారు. ఈ దఫా కార్యక్రమంలోనూ క్రితంసారి వివరాలతో సరిపెట్టకుండా, అదనంగా కుటుంబంగా ఏర్పడినవారికి ఒక్కో ఎన్పీఆర్‌ను కేటాయించి వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబానికి సంబంధించి 2011లో సేకరించిన ఎన్‌పీఆర్‌నే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ పరిశీలించి దానికి అదనంగా ఆధార్, జాతీయత, నివాస వివరాలు వంటివాటినీ జతపరచనున్నారు.
అక్రమ వలసలు నిరోధించేందుకే!
ప్రపంచ దేశాలు అక్రమ వలసలపట్ల చాలా కఠినంగా ఉంటున్నాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలకు వెళ్లి స్థిరనివాసం ఏర్పరచుకోవడం కష్టం. అందుకే మెక్సికో, ఆఫ్రికాలకు చెందిన పేదలు ప్రాణాలకు తెగించి సముద్రాలు, ఎడారుల ద్వారా ప్రయాణించి అమెరికా, ఐరోపాల్లో అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అక్రమ వలసలను నిరోధించే లక్ష్యంతోనే మెక్సికో సరిహద్దులో 926 కిలోమీటర్ల పొడవైన గోడను రూ.1.10 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు. అసోమ్‌లో ఎన్‌ఆర్‌సీ కచ్చితంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరవాతే చర్యలు తీసుకున్నారు. పక్కనున్న పాకిస్థాన్ ప్రభుత్వం సైతం ఎట్టిపరిస్థితుల్లో అక్రమ వలసలను అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. ప్రపంచంలోని అనేక దేశాలు అక్రమ వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పదేళ్లకోమారు నిర్వహించే జనగణన- మొత్తం ప్రజల సంఖ్య, వారి సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు అవసరం వంటి నిర్దుష్ట అంచనాల తయారీకి ఉపకరిస్తుంది. ఒకవేళ పదేళ్ల వ్యవధిలో లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులు వచ్చి చేరేతే అంతమందికి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారు? వర్ధమాన దేశాలతోపాటు అభివృద్ధి చెందిన సమాజమూ అక్రమ వలసలపై ఆందోళన వ్యక్తీకరించడానికి ప్రధాన కారణం ఇదే!
పౌరబాధ్యత
భారత్‌లో పెరిగిపోతున్న జనాభా ఎంత, అసలు పేదలెంతమంది, ఎవరికి ఎలాంటి సదుపాయాలున్నాయనేది స్పష్టంగా తేల్చేది జనగణన మాత్రమే. ఇప్పటికే గతంలో 15 సార్లు జనగణన జరిగినా చాలా విషయాల్లో స్పష్టమైన గణాంకాలు లేవు. మీరు ఏ వృత్తిలో ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయ కూలీలా వంటి ప్రశ్నలు 130 ఏళ్ల క్రితం 1891లో జరిగిన జనగణనలో బ్రిటిష జమానాలోనే అడిగారు. అప్పటినుంచి ఇప్పటివరకూ 14 సార్లు ఈ తరహా వివరాలు సేకరించారు. కానీ దేశంలో ఇప్పటికీ రైతులెందరు, వారి కుటుంబాలెన్ని అనే లెక్కలే సరిగా లేవన్నది కఠిన వాస్తవం. వాటి సేకరణకు ప్రత్యేకంగా కార్యదళం(టాస్క్‌ఫోర్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్రం పార్లమెంటులో తెలిపింది. రైతులెందరు అన్న విషయం సరిగ్గా తెలియనప్పుడు, ఇక వారికి సంక్షేమ పథకాలు ఏ ప్రాతిపదికన చేపడతారు, వ్యవసాయాభివృద్ధికి ఏ లెక్కన నిధులు కేటాయిస్తారు అనేవి కీలక ప్రశ్నలు. భారత్‌లోని ప్రస్తుత జనాభాలో 65 శాతం పునరుత్పత్తి సామర్థ్యమున్న వయసులో ఉన్నారు. వీరివల్ల జనాభా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఇక్కడ పుట్టేవారికే కూడు, గూడు, వస్త్రాలు సమకూర్చలేక ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పించడం సాధ్యం కాక ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం జనగణన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సంక్షేమ పథకాల అమలుకు ఆ వివరాలు తప్పనిసరి అని చెబుతోంది.
అభివృద్ధికి కీలకం!
రోడ్లు వేయాలన్నా, ఆహార భద్రత కల్పించాలన్నా, పథకాలు అమలు చేయాలన్నా జనగణనలో శ్రద్ధగా పాల్గొనాలని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఆ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశమే సంక్షేమ పథకాల అమలు క్రమంలో జనగణన తప్పనిసరి అని భావిస్తుండటం గమనార్హం. సాధారణ కుటుంబమే తమ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి కొద్దిరోజులు ఉండే పరిస్థితుల్లో- మొత్తం ఎంత ఖర్చు కావచ్చు, వారికి సదుపాయాల కల్పన ఎలా వంటి అంశాలపై ఆలోచిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్న రెండో దేశమైన భారత్‌లో జనాభా ఎంత అనేది పక్కాగా తేల్చాల్సిందే. తెలంగాణ ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టిన ‘సమగ్ర సర్వే’ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, విధానాల రూపకల్పనకు ఉపయోగపడింది. మనదేశంలో ప్రజల మేలు కోసం ఏ పథకం అమలుచేయాలన్నా అసలు అది ఎందరికి చేరాలనేది సరైన గణాంకాలు లేకుండా ఎన్ని నిధులు కేటాయిస్తే ఏం ప్రయోజనం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజల సొమ్మే. ఇప్పుడు రూ.7,000 కోట్లు వెచ్చించి నిర్వహించే జనగణన సక్రమంగా సాగకపోతే ఈ సొమ్మే కాకుండా వచ్చే పదేళ్లలో దేశంలో ఖర్చుపెట్టే లక్షల కోట్ల రూపాయలూ దుర్వినియోగం కావడానికి బీజం మనమే వేసినట్లు అవుతుంది.
ఇదీ చూడండి: భారత్‌ను కలవరపెడుతున్న కరోనా- అప్రమత్తమైన యంత్రాంగం