భారత సైన్యాధికారి నవజోత్ సింగ్ బల్ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం దిల్లీ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు రోడ్డు ప్రయాణం ద్వార చేరుకున్నారు కుటుంబ సభ్యులు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నా పోలీసులు, సైన్యాధికారులు తమకు గొప్ప సహకారం అందించారని నవజోత్ సోదరుడు నవతేజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణం సాగుతున్న తీరును పలు సార్లు పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు గొప్పగా కృషి చేస్తున్నారని తెలిపారు.
పలువురి సంతాపం...
సైన్యంలో తన సేవలకు గాను శౌర్యచక్ర పురస్కారంతో పాటు, గాలెంట్రీ అవార్డును పొందిన కల్నల్ నవ్జోత్ సింగ్ బల్ మృతికి పౌరులు, సైనికులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పించారు. కన్నకొడుకు అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు ఇన్ని కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయటం పట్ల మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ విచారం వ్యక్తం చేశారు.
"కల్నల్ నవ్జోత్ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి. ఆయన తల్లిదండ్రులు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోవటం విచారకరం. లాక్డౌన్ ఉన్నా... ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు మార్చుకోవచ్చు."
- మాజీ సైన్యాధిపతి వీ. పీ మాలిక్ ట్వీట్.
సైన్యం సహాయం తిరస్కరణ..
నవ్జోత్ సింగ్ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి దిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తామని సైనికాధికారులు తల్లిదండ్రులను కోరగా, వారు తిరస్కరించారు. బెంగళూరులోనే అంతిమ సంస్కరాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత