పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తుతున్న వేళ... ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అసోం, త్రిపురలో రైళ్లు నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే విమానాలు రద్దయ్యాయి.
రైళ్లకు బ్రేక్...
బుధవారం ఆందోళనకారులు దిబ్రూగఢ్‌లోని చబౌ, టిన్సుకియా జిల్లాలోని పనిటోలా రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టిన నేపథ్యంలో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. త్రిపుర, అసోంలో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసింది. సుదూర ప్రయాణాలు చేసే రైళ్లను గువహటి వరకే పరిమితం చేసింది.
రైళ్ల నిలిపివేతతో అనేక మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వేర్వేరు చోట్ల చిక్కుకున్న ఇతర ప్రాంతాల వాసుల్ని గమ్యస్థానాలకు చేర్చడంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రత్యేక రైళ్లు నడపాలని భావించినా... నిరసనకారులు వాటిపైనా దాడి చేసే ప్రమాదముందని అనుమానిస్తోంది.
రైల్వే ఆస్తుల భద్రత కోసం 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఈశాన్య రాష్ట్రాలకు పంపింది భారతీయ రైల్వే.
విమానాలు బంద్
అసోంలోని వేర్వేరు నగరాలకు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా సహా ప్రైవేటు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా గువహటి విమానాశ్రయంలో వందల మంది ప్రయాణికులు చిక్కుకుని, అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి:'పౌర' సెగ: రణరంగంలా అసోం- నిరసనకారుల విధ్వంసకాండ