సాగు చట్టాలపై రైతుల నిరసనలతో నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరగా తెరదించాలని కేంద్రాన్ని, కర్షక సంఘాలను కోరారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దిల్లీలో భేటీ అయిన అనంతరం ఈమేరకు వ్యాఖ్యానించారు. కొత్త చట్టాలపై రైతుల అభ్యంతరాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
" కేంద్రం, రైతుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సమస్య పరిష్కారం నా చేతుల్లో లేదు. చట్టాల పట్ల నా వ్యతిరేకతను అమిత్ షాకు తెలియజేశా. పంజాబ్ ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతపై రైతుల ఆందోళన తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరా."
- అమరిందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి.
కేంద్రం, రైతులు మొండిగా వ్యవహరించకుండా... ఏకాభిప్రాయానికి రావాలని కోరారు అమరిందర్. ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించగా... ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సమస్య పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టంచేశారు.
రూ.5 లక్షల సాయం..
దిల్లీలో జరుగుతోన్న ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పంజాబ్ రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం అమరిందర్. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: రైతు సంఘాల నేతలతో కేంద్రం కీలక భేటీ