దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. బంగాల్ ముర్షీదాబాద్‌లో ఆరుగురు, కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ బృందానికి హసన్ అనే వ్యక్తి నేతృత్వం వహిస్తున్నట్లు తెలిపింది. ఎర్నాకుళంలో అరెస్టయిన ముగ్గురూ బంగాల్‌కు చెందినవారేనని ఎన్ఐఏ పేర్కొంది.
నిఘా వర్గాల సమాచారంతో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో వీరికి సంబంధించిన ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ ముఠాపై సెప్టెంబర్ 11 నుంచి దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.
"అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా బంగాల్, కేళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరి కొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దాడులు నిర్వహించి వారందరినీ అరెస్టు చేశాం" అని ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.
ఆయుధాల స్వాధీనం..
ఈ బృందం ఇప్పటికే ఆయుధాల సేకరణలో చివరిదశలో ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆధారాలు సేకరించారు. దస్త్రాలు, డిజిటల్ పరికరాలు, జీహాదీ సాహిత్యం, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.
వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా అనుబంధ సభ్యులని ఎన్‌ఐఏ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అల్‌ఖైదాలో చేరి దిల్లీ సహా, దేశ వ్యాప్తంగా దాడులకు కుట్ర చేసినట్లు పేర్కొంది. నిధుల సేకరణకు పాల్పడటం సహా, వీరిలో కొందరు కశ్మీర్ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించింది.
అరెస్టైంది వీరే..
ముర్షీద్ హసన్, యాకుబ్ బిస్వాస్, ముషారప్ హుస్సేన్‌లను కేరళలో అరెస్టు చేయాగా.. షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యీన్ అహ్మద్, మనుమ్ కమల్, రెహ్మాన్‌లను ముషీరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
బాంబులకు అడ్డా: గవర్నర్
ఉగ్రముఠా అరెస్టుపై స్పందించిన బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్.. రాష్ట్రం బాంబుల తయారీకి నిలయంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధీనంలోని పోలీసు శాఖ ప్రతిపక్షాలపై ప్రతాపం చూపే పనిలో పడిందన్నారు. శాంతిభద్రతలకు కలుగుతున్న ఆటంకాలపై దృష్టిసారిండం లేదని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ వాస్తవాలకు దూరంగా జీవిస్తున్నట్లు విమర్శించారు. ఏం జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
బంగాల్లో రాజకీయ దుమారం..
ఉగ్రవాదుల అరెస్టుపై బంగాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. మమత ప్రభుత్వం లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ ఆరోపణలు చేశాయి.
ఇది కచ్చితంగా పోలీసుల నిఘా విభాగం వైఫల్యమేనని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదురి ఆరోపించారు. ఇంతకుముందు జమాత్ తీవ్రవాదులు అరెస్టుకాగా, ఇప్పుడు ఏకంగా ఆల్‌ఖైదా ఉగ్రవాదులే పట్టుబడ్డారని విమర్శించారు. ఈ ఘటన ముర్షీదాబాద్ జిల్లాకు అపఖ్యాతి తెచ్చిందన్నారు.
తృణమూల్ ఓటుబ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి.. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాలని భాజపా నేత రాహుల్ సిన్హా విమర్శలు చేశారు.
మేం సిద్ధంగా ఉన్నాం: భద్రతా అధికారులు
ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో కేరళ కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్ అధికారులు స్పందించారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
సీపీఐ, కాంగ్రెస్ పాలనలో కేరళ ఉగ్రవాదులకు రహస్య స్థావరంగా మారుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ విమర్శించారు. కేరళలో ఐసిస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఇటీవల ఐరాస నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ ధ్వంసమైందని కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది.
ఇదీ చూడండి: నియంత్రణ రేఖ వెంబడి భారీగా భద్రత బలగాల మోహరింపు