దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత క్షీణించడం పట్ల ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్య అని, దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, దేశం వందేళ్లు వెనక్కి వెళ్లడానికి అనుమతిస్తారా? అని ప్రశ్నించింది అత్యున్నత ధర్మాసనం.
"వాయు కాలుష్యంతో ప్రజలు ఇలాగే మరణించేందుకు అంగీకరిస్తారా.? దేశం వందేళ్లు వెనక్కి వెళ్లేందుకు అనుమతిస్తారా? దీనికి ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేస్తాం. సంక్షేమ ప్రభుత్వాన్ని మీరు మరిచిపోయారు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుల బాగోగులు చూడటం రాష్ట్ర ప్రభుత్వ విధి. మీకు పేద ప్రజల గురించి పట్టింపు లేదు. ఇది దురదృష్టకరం."
-సుప్రీంకోర్టు.
'వారికి అధికారంలో ఉండే హక్కు లేదు..'
పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీం. ప్రజా సమస్యలపై పట్టింపు లేకుంటే వారికి అధికారంలో ఉండే హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వం తరఫున ఎందుకు సేకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.
'ధర ఇచ్చి కొనండి'
ఇప్పటివరకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయని చిన్న, మధ్య తరహా రైతులకు క్వింటాల్‌కు రూ. 100 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇందుకోసం 7 రోజులు గడువు విధించింది.
'సమగ్ర పథకం ద్వారా'
వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా అవసరమైన యంత్ర పరికరాలను అందజేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్రం సహా పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ ప్రభుత్వాలు ఈ వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు మూడు నెలల్లోగా ఓ సమగ్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది.
కేంద్రానికి సూచన
వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత, కాలుష్య నియంత్రణపై ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.
రహదారులపైనా..
దేశ రాజధాని నగరంలో చదును చేయని మార్గాలు, రహదారులపై గుంతలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: రాజ్యాంగానికి 70ఏళ్లు.. 26న ఉభయ సభల సమావేశం