న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కేసులో శిక్షపడిన సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కేసు తీర్పును సవాల్ చేస్తూ దాఖలుచేసే అప్పీల్‌ను మరో బెంచ్ లేదా విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కోరారు.
ఈ కేసులో విధించిన రూపాయి జరిమానాను ఈనెల 15లోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని అత్యున్నత న్యాయస్థానం గత నెల 31న ఆదేశించింది. లేదంటే 3 నెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌పై నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. కామినీ జైస్వాల్ ద్వారా కొత్త పిటిషన్ దాఖలు చేసిన ప్రశాంత్ భూషణ్.. నేరపూరిత ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి అదే కోర్టులో చేసుకునే అప్పీల్‌ను విస్తృత, మరో బెంచ్ ద్వారా విచారించటానికి అనుమతించాలన్నారు.
అప్పీల్ చేసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టం కల్పించాయన్న పిటిషనర్.. తప్పుడు తీర్పుల నుంచి రక్షణ, సత్యానికి రక్షణగా నిలుస్తుందన్నారు. పిటిషన్లో న్యాయ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రతివాదులుగా పేర్కొన్న పిటిషనర్.. నేరపూరిత ధిక్కరణ కేసులకు సంబంధించి అదే కోర్టుల్లో అప్పీల్ చేసుకోవటానికి నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నేరపూరిత ధిక్కరణ కేసులో దోషిగా ఖరారైన వ్యక్తి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసే రివ్యూ పిటిషన్అర్హతను పిటిషనర్‌ను సంప్రదించకుండా బెంచ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: అసలెవరీ ప్రశాంత్ భూషణ్? ఆయన ఏమన్నారు?