సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా బిల్లును ఆమోదించొద్దని రాష్ట్రపతిని కోరారు పీపుల్స్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) కార్యకర్తలు. వినతి పత్రం అందించేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు గేట్ నంబర్-38 వద్ద సమావేశమయ్యారు ఎన్సీపీఆర్ఐ కార్యకర్తలు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇటీవలే స.హ. చట్టం సవరణ బిల్లు-2019కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఇది ప్రజాస్వామ్యమేనా?
తమను అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా తప్పబట్టారు ఎన్సీపీఆర్ఐ కార్యకర్తలు. మన దేశంలో శాంతియుతంగా రాష్ట్రపతికి పిటిషన్ అందించే హక్కు లేదా? ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు. సమాచార కమిషన్ స్వతంత్రతను హరిస్తున్నారని ఆరోపించారు.
తిరిగి పార్లమెంట్‌కు పంపండి: కాంగ్రెస్
ఆర్టీఐ చట్ట సవరణ బిల్లులోని అభ్యంతరకర నియమాలను పరిశీలించేందుకు బిల్లును తిరిగి పార్లమెంట్‌కు పంపించాలని రాష్ట్రపతిని కోరారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111లోని విచక్షణ అధికారాలతో బిల్లును తిప్పిపంపాలని కోరారు. ఆర్టీఐ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'అనర్హులకు అనుమతిస్తే బూటకపు వైద్యమే'