భారతదేశ ప్రజల నుంచి తిరిగి ఇవ్వలేనంత పొందానని తన తండ్రి ఎప్పుడూ చెబుతుంటారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి చేసిన ట్వీట్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
"ఈ రోజుతో 96 గంటల పర్యవేక్షణ పూర్తవుతుంది. ఆయన ఆరోగ్య సూచీలన్నీ బాగున్నాయి. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు." అని తెలిపారు.
ఈ నేపథ్యంలో తండ్రి మాటల్ని గుర్తుచేసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అలానే తన తండ్రి ఎప్పుడూ యోధుడేనని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని శ్రేయోభిలాషులను కోరారు. అంతకుముందు ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కూడా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నప్పటికీ వైద్యానికి మెల్లగా స్పందిస్తున్నారని, ఆయన గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని ట్వీట్ చేశారు.
ఆరోగ్య పరిస్థితి..
కొద్ది రోజుల క్రితం మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రణబ్ ముఖర్జీకి దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలానే శస్త్రచికిత్సకు ముందు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇదీ చూడండి:ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన