తూర్పు దిల్లీ నుంచి భాజపా తరపున లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఆమ్‌ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేసినట్టు ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విట్టర్‌లో తెలిపారు.
దిల్లీలోని కరోల్‌బాగ్, రాజేంద్రనగర్ రెండు నియోజకవర్గాల్లోనూ గంభీర్‌కు ఓట్లు ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 125-ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని అన్నారు.
కొద్ది రోజుల్లో ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి ఓటేయడం వృథా అని ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ గంభీర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
మరోవైపు భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్‌పై అనవసర వివాదాలు సృష్టించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారి విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆమ్‌ఆద్మీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని తివారీ అన్నారు.
- ఇదీ చూడండి: అది ప్రియాంక సొంత నిర్ణయం: పిట్రోడా