'అమ్మా నడిచి నడిచి నా చిన్ని కాళ్లు నొప్పిగా ఉన్నాయి.. ఆకలి కూడా వేస్తోంది.. నేనింక నడవలేనమ్మా' అని బిక్కమొహం వేసుకుని కోరిన కుమారుడిని బరువెక్కిన గుండెకు హత్తుకుంది ఓ వలస తల్లి. ఏదేమైనా త్వరగా సొంతగూటికి చేరేందుకే పూనుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో సూట్‌కేసుపై ఎనిమిదేళ్ల చిన్నారిని పడుకోబెట్టి.. శక్తినంతా కూడగట్టి లాగింది.
ఝాన్సీ జిల్లా మహోబాకు చెందిన రమావతి ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. దీంతో తమ బృందంతో కలిసి సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వాలు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశాయనే సమాచారం లేక ఎనిమిదేళ్ల కుమారుడితో కాలినడకన ప్రయాణం మొదలు పెట్టింది.
మండుటెండలో సెగలుగక్కుతున్న రోడ్లపై నడిచి అలసిపోయాడు చిన్నారి. దీంతో సామాన్లు పెట్టుకున్న సూట్‌కేస్‌కు ఓ తాడు కట్టింది రమావతి. సూట్‌కేస్‌పై తనయుడిని పడుకోబెట్టి, దానిని లాగుతూ తోటి వారితో సమానంగా నడవసాగింది. వలస కష్టాలకు ఆయాసపడుతూనే.. అమ్మతనాన్ని చాటిన రమావతి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఇదీ చదవండి:బిడ్డను ఒడిలో మోస్తూ ఓ తల్లి సాహసం!