భారీ వర్షాలు... లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం... ఇదీ కేరళలో కొద్దిరోజుల కింది పరిస్థితి.
అయితే.. మనకు తెలియని మరో సన్నివేశం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. అందరి హృదయాల్ని కొల్లగొట్టింది. మలప్పురంలోని ఓ మసీదు గురించే ఇదంతా. అవును.. వరద ప్రభావానికి కేరళలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్లన్నీ జలమయమవడం... మృతదేహాల్ని పంచనామాకు తరలించడం.. వంటి సమస్యలతో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. బాధితులకు శరణు కల్పించడం.. ఒకెత్తు అయితే ఈ 'మసీదు ఘటన' అంతకుమించి.
పోతుక్కల్లోని 'మసీదుల్ ముజాహిదీన్' అనే ముస్లింల ప్రార్థనా మందిరం.. వరద బాధితుల కోసం తలుపులు తెరిచింది. ఆశ్రయం కల్పించడమే కాదు.. వర్ష ప్రభావానికి మరణించిన 31 మందికి ఇక్కడ శవపరీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చారు నిర్వాహకులు.
35 కి.మీ. వెళ్లలేక...
భారీ వర్షాలకు.. పలు ప్రాంతాలు నీట మునిగాయి. కవలప్పరలోనే దాదాపు 31 మంది మరణించారు. మృతదేహాల శవపరీక్షల నిమిత్తం 35 కి.మీ. దూరంలో ఉన్న నీలంబూర్ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి. రవాణా వ్యవస్థ స్తంభించిన కారణంగా.. అది వీలు కాలేదు. దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ లేదు.
ముస్లిం పెద్దల మంచి మనసుతో...
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధికారులకు ఒకే మార్గం కనిపించింది. 10 నిమిషాల్లో చేరుకునే.. మసీదులో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేయచ్చని భావించి.. అక్కడి పెద్దలను కలిశారు. ముస్లిం మత పెద్దలు మంచి మనసుతో అంగీకరించి.. మసీదులోనే తగిన ఏర్పాట్లు చేశారు. శవపరీక్షకు అవసరమైన అన్ని బల్లలు, పడకలు, లైటింగ్ సదుపాయాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వీటిని స్థానిక మదర్సా నుంచి సేకరించారు.
రోజురోజుకూ విజృంభించిన వర్షాలతో మృతుల సంఖ్య పెరిగిన కారణంగా ముస్లిం మహిళల ప్రార్థనా గదిని ఇచ్చేందుకూ నిర్వాహకులు పెద్ద మనసుతో సమ్మతించారు. ఒకవైపు పంచనామా ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు మసీదులో ప్రార్థనలు నిర్వహించడం విశేషం. ఈ ఘటన మతసామరస్యానికి అద్దం పడుతోంది.
ఇదీ చూడండి: 'వరదలు': నదిని దాటబోయి శవంగా తేలి..