అధికరణ 370, 35ఏ రద్దుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కొనియాడారు పలువురు భాజపా నేతలు.
చారిత్రక నిర్ణయం: జైట్లీ
ఆర్టికల్ 370 రద్దు జాతీయ సమైక్యత వైపుగా ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ. ప్రత్యేక హోదా వేర్పాటువాదానికి దారితీస్తుందన్నారు. ఈ పరిస్థితిని కొనసాగించడానికి ఏ దేశం అంగీకరించదని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు జైట్లీ. ప్రభుత్వ నిర్ణయం జమ్ముకశ్మీర్ ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో లాభం చేకూర్చుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు.
ఏడు దశాబ్దాల కల నెరవేరింది: రామ్ మాధవ్
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు భాజపా నేత రామ్ మాధవ్. భారత్‌లో జమ్ముకశ్మీర్‌ను పూర్తి స్థాయిలో ఏకీకృతం చేసేందుకు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ, వేల మంది ప్రాణత్యాగాలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో.. ఏడు దశాబ్దాలుగా దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నెరవేరిందన్నారు.
ఇదీ చూడండి: దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు