నెల క్రితం ఫొని తుపాను ఒడిశాను అతలాకుతలం చేసింది. ఇది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే.. ఇప్పటికీ తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. లక్షా 64 వేల కుటుంబాలకు చెందిన 5 లక్షల మందికి పైగా ఇంకా అంధకారంలోనే జీవనం సాగిస్తున్నారు.
అత్యంత ఎక్కువగా ప్రభావితమైన పూరీలో 52 శాతం విద్యుత్తు పనులను మాత్రమే పునరుద్ధరించారు. మే 3న తీవ్రమైన వర్షాలు ఇక్కడి ప్రజల్ని బెంబేలెత్తించాయి.
ఫొని ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 64 మంది మృతి చెందారు. మృతులు పూరీలోనే అత్యధికంగా 39 మంది ఉన్నారు. ఈ తుపాను రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కోటీ 65 లక్షల మందికి పైగా ప్రజల్ని ప్రభావితం చేసింది.
మొత్తం 25 లక్షలకు పైగా ఇళ్లల్లో విద్యుత్తు నిలిచిపోగా.. 23 లక్షల గృహాలకు విద్యుత్తును పునరుద్ధరించినట్లు వెల్లడించారు అధికారులు. బ్యాంకింగ్, టెలికాం, త్రాగు నీరు, ఇతర సేవలు గతం కంటే మెరుగైనట్లు పేర్కొన్నారు. మిగతా పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.