కరోనా వైరస్ భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి భయాలతోనే ఒడిశాలోని బాలాసోర్‌లో ఓ కుటుంబాన్ని లోపలికి రాకుండా ఇంటి యజమాని అడ్డుకున్నాడు. దీంతో 8 గంటలకుపైగా వారందరూ తమ ఇంటి బయటే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జరిగింది ఇదీ
బాలాసోర్‌కి చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్ చికిత్స నిమిత్తం భువనేశ్వర్‌కు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం స్వస్థలానికి తిరిగివచ్చారు. దేశంలోని కొవిడ్ హాట్స్పాట్లలో భువనేశ్వర్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన ఆ కుటుంబాన్ని ఇంటి యజమాని అడ్డుకున్నాడు. ఇంట్లోకి రాకుండా ఆపేశాడు.
అనంతరం అధికారులు రంగంలోకి దిగారు. ఇంటి యజమానితో మాట్లాడి క్యాన్సర్ బాధితుడు సహా అతని భార్యను ఇంట్లోకి అనుమతించే విధంగా ఒప్పించారు. అయితే ఇద్దరు కుమారులు మాత్రం బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
యజమాని అడ్డుకోవడం వల్ల 7-8 గంటలు ఇంటి వెలుపలే వారంతా వేచి చూశారని బాలాసోర్ తహసీల్దార్ పేర్కొన్నారు. అవసరమైతే ఈ అమానవీయ ఘటనపై బాధితులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించారు.