ఇప్పుడంటే ఇంటిముందు ఓ బెంజ్ కారున్నా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఓ అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్తే.. ఎవరింటి ముందైనా ఓ సైకిల్ కనిపిస్తే చాలు కళ్లప్పగించి అలాగే చూసేవారు. అవును మరి, అప్పట్లో సైకిళ్లే వారికి లగ్జరీ ప్రయాణ సాధనాలు. ఆ కాలం నాటి ఓ సైకిల్.. 70 ఏళ్లుగా ఏ లోటు లేకుండా మన్నుతోంది. కేరళకు చెందిన మార్షల్ కుటుంబానికి బహుమతిగా వచ్చి వంశపారంపర్య ఆస్తిగా మారింది.
బహుమతిగా వచ్చింది...
1950లో ఇడుక్కి జిల్లా మున్నూర్లోని ఓ టీ కంపెననీలో ఉద్యోగం చేసేవాడు మార్షల్ ఎ పెరీరా. అదే సమయంలో మార్షల్‌కు పరిచయమైన ఓ వ్యాపారి.. ఇంగ్లాండ్ కార్ల్టన్ ఫ్యాక్టరీలో తయారైన సన్ బ్రాండ్ సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో మార్షల్‌తో పాటు కుమారులు అలెగ్జాండర్ షార్ట్పూల్, సిరిల్ పెరీరా, కుమార్తె షిర్లీ పాల్ కూడా ఈ సైకిల్‌ను నడిపేవారు.
1981లో మార్షల్ కుటుంబం తిరువనంతపురానికి మారింది. వారితోపాటే సన్ సైకిల్ కూడా వచ్చేసింది. అక్కడ షిర్లీ కుమారులు జార్జ్, జాన్ ఈ సైకిల్‌పైనే స్కూలుకు వెళ్లేవారు. ఆ తర్వాత ఈ సైకిలే వారిని కాలేజీకి తీసుకెళ్లింది. అలా వంశపారంపర్యంగా చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు మార్షల్ మునిమనవళ్లూ ఈ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు.
చెక్కు చెదరలేదు...
నాలుగో తరాన్ని మోస్తున్న ఈ సైకిల్ ఇప్పటి వరకు ఆగింది లేదు. ఓసారి ఈ సైకిల్ హెడ్‌లైట్‌ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత చిన్న చిన్న పంక్చర్ల వల్ల పలుమార్లు చక్రాలు మార్చారు. అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్ 70 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.
ఇదీ చదవండి:జాగ్తే రహో: ఛార్జింగ్ పెడితే బ్యాంక్ ఖాతా ఖాళీ!