ప్రాణం నిలిపే దేవుళ్లంటూ వైద్యులకు చేతులెత్తి మొక్కుతాం. ఆరోగ్యాలు కాపాడేది ఆసుపత్రులేనని నమ్ముతాం. మరి అలాంటి దేవుళ్లే.. పైసల కోసం పైశాచికంగా ప్రవర్తిస్తే? అవును, మధ్యప్రదేశ్ షాజాపుర్లో.. అమానుషానికి పరాకాష్ఠగా నిలిచింది ఓ ప్రైవేటు ఆసుపత్రి. బిల్లు కట్టనందుకు.. 80 ఏళ్ల ఓ తాతను మంచానికి కట్టేసి నరకం చూపించారు ఆ దవాఖానా సిబ్బంది.
రాజ్‌గఢ్‌కు చెందిన లక్ష్మీనారాయణకు ఒంట్లో బాలేదని.. దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది కూతురు. చికిత్స పేరిట అప్పటికే రూ.11 వేలు వసూలుచేశారు ఆసుపత్రి సిబ్బంది. కొద్ది రోజులు వైద్యం చేసి.. మరో రూ.11 వేలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అంత డబ్బు కట్టే స్థోమత తమకు లేదని వేడుకున్నారా తండ్రీ కూతుళ్లు. దీంతో, వృద్ధుడనే జాలి మచ్చుకైనా లేకుండా నారాయణను లాక్కెళ్లి తాళ్లతో మంచానికి కట్టేశారు సిబ్బంది. పూర్తి డబ్బు చెల్లించేవరకు వదిలేది లేదన్నారు.
ఐదు రోజుల పాటు కనీసం అన్నం పెట్టకుండా హింసించారని వాపోయాడు బాధితుడు. డబ్బు కట్టలేని తమ దయనీయ స్థితిని అర్థం చేసుకోకుండా క్రూరంగా ప్రవర్తించారని రోధించాడు.
"కరోనా కారణంగా డబ్బులు సర్దలేకపోయా. నేను బయటకి వెళ్లిపోతుంటే.. నాన్న కూడా నా వెనకే నడిచాడు. అది చూసిన సిబ్బంది.. నాన్నను లాక్కెళ్లారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా, నాన్నను తాళ్లతో కట్టేశారు. బిల్లు కట్టేవరకు వదలమన్నారు."
-లక్ష్మీనారాయణ కూతురు.
ఇదీ చదవండి:బైక్ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!