పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం పలు రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ చెన్నైలో కొంతమంది వినూత్న నిరసన చేపట్టారు. బేసంత్ నగర్ ప్రాంతంలో ఎనిమిది మంది కలిసి ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ముగ్గులు(రంగోళీ) వేసి తమ నిరసనలు తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
ఇతరులకు ఇబ్బందని...
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత సమయం పాటు వారిని నిర్బంధించినట్లు స్పష్టం చేశారు. ఇలాంటివి మరోసారి చేయకుండా వారిని హెచ్చరించి వదిలేసినట్లు వివరించారు.
పోలీసుల దౌర్జన్యం!
మరోవైపు అదుపులో తీసుకున్న సమయంలో పోలీసులు దౌర్జన్యంగా తమపై చేయిచేసుకున్నారని నిరసనకారులు ఆరోపించారు. తమ సెల్ఫోన్లను లాక్కున్నారని అన్నారు.