మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్కులో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ గురువారం సాయంత్రం.... ఉద్ధవ్‌తో ప్రమాణం చేయించారు. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి మహా వికాస్ అఘాడీ కూటమి కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.
ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏకంగా ఆరుగురు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు హాజరవడం విశేషం. ఇందులో ఎన్సీపీ దిగ్గజ నేత శరద్ పవార్, శివసేన నేత మనోహర్ జోషీ, కాంగ్రెస్‌కు చెందిన సుశీల్ కుమార్ శిందే, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు. వీరంతా మహారాష్ట్రకు వేర్వేరు కాలాల్లో సీఎంలుగా పనిచేసినవారే.
ఫడణవీస్ 2014-19 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
పవార్ 4 సార్లు... పూర్తి కాలం ఫడణవీసే..
శరద్ పవార్ నాలుగు సార్లు, అశోక్ చవాన్, ఫడణవీస్ రెండుసార్లు సీఎంలుగా పనిచేశారు. జోషీ, శిందే, పృథ్వీరాజ్ చవాన్‌లు ఒక్కోసారి మహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
అయితే.. ఈ ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో ఫడణవీస్ మాత్రమే పూర్తి కాలం పదవిలో (5 సంవత్సరాలు) కొనసాగడం గమనార్హం. మహా సీఎం పీఠం అధిరోహించిన తొలి భాజపా నేత ఈయనే కావడం విశేషం.
ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన వారు ఉద్ధవే. శివసేన నుంచి మూడో వ్యక్తి. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రి.
అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించింది. నెలరోజులకుపైగా 'సీఎం' పీఠంపై ఉత్కంఠ కొనసాగింది. మధ్యలో అనూహ్యంగా ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అనేక ఉత్కంఠ మలుపులు తిరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి కిరీటం చివరకు ఉద్ధవ్ ఠాక్రేనే వరించింది.
ఇదీ చూడండి: ఉద్ధవ్ ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ గైర్హాజరు