బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. వర్షాలకు తోడు పిడుగులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పిడుగుల ధాటికి రెండు రోజుల్లో సుమారు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్‌లో 39 మంది..
బిహార్‌లోని 12 జిల్లాల్లో పిడుగులు పడి మొత్తం 39 మంది మరణించారు. జుముయీ జిల్లాలో 8, ఔరంగాబాద్‌లో ఏడుగురు, రోహతాస్‌లో ముగ్గురు, తూర్పు చంపారన్, భగల్పుర్, బంకాలో నలుగురి చొప్పున, నవాదా, నలంద, కటిహార్‌లో ఇద్దరి చొప్పున, ముంగెర్, అర్వాల్, గయాలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయప్డడారు.
వరదల్లో 123 మంది..
బిహార్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 123కి చేరింది. గత రెండు రోజుల్లోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు సగటు వర్షపాతం 28.9 మిల్లీమీటర్లుగా నమోదయింది.
ఝార్ఖండ్‌లో...
పిడుగులు పడి ఝార్ఖండ్‌లోని వివిధ జిల్లాలో మొత్తం 12 మంది మృతి చెందారు. జమ్తారా జిల్లాలో ఆరుగురు మరణించగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా దగ్గరలోని చెరువులో స్నానం చేసి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలో మైదానం పక్కన ఉన్న చెట్టుకింద నిలుచుని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నవారిపై పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పకుర్, దుమ్కా జిల్లాలో ఇద్దరి చొప్పున మృతి చెందారు.
ఇదీ చూడండి: దావత్ నుంచి బైక్‌లపై తిరిగెళ్తూ నలుగురు మృతి