తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజ్యలక్ష్మీ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ వివిధ రకాల బాణాసంచా తయారీలో దాదాపు 50 మంది కార్మికులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. బాణసంచా తయారీకి ఉపయోగించే పదార్థాల్లో రసాయనిక చర్యే ఇందుకు కారణంగా ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో విరుదునగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి: ముంబయి సిటీ సెంటర్ మాల్లో అగ్నిప్రమాదం