బంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని కచువాలో ఘోరం జరిగింది. లోక్నాథ్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తులపై పందిరి కూలింది. ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
వెదురు పందిళ్లు కూలి...
లోక్నాథ్ దేవాలయంలో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేడుకలు జరుగుతుండగా పెద్ద వర్షం కురవడం మొదలైంది. దీంతో ప్రజలు దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన వెదురు పందిళ్ల కిందకు వచ్చారు. ఇంతలోనే వర్షాల దాటికి పందిళ్లు కూలిపోయాయి. భయంతో ప్రజలు పరుగులెత్తారు. మార్గం ఇరుకుగా ఉండడం వల్ల కొందరు దేవాలయం పక్కన ఉన్న చెరువులో పడిపోయారు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. చివరకు తొక్కిసలాట జరిగింది.
రూ.5 లక్షలు పరిహారం
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: తమిళనాట ఉగ్ర కలకలం... సర్వత్రా హైఅలర్ట్