పనితీరు సక్రమంగా కనబరచని 32 మంది అధికారులను ముందస్తు పదవీ విరమణ పేరిట రైల్వే శాఖ ఇంటికి పంపించింది. ఉద్యోగుల పనితీరుపై నిర్ణీత కాలవ్యవధిలో చేపట్టిన సమీక్షలో అసమర్థత, పనిపట్ల నిబద్ధత లేకపోవడం, సరైన ప్రవర్తన లేని 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ ఇచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇలా పనితీరు ఆధారంగా రైల్వేలో ముందస్తు పదవీ విరమణ చేయించడం అరుదు. ఇటీవల కాలంలో 2016-17లో ఇలానే నలుగురు అధికారులపై ‘ముందస్తు’ వేటు వేశారు.
ఉద్యోగుల సంఖ్య కుదింపులో భాగంగా..
నిర్ణీత వయసు దాటిన వారి పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం జరిగేదేనని, ఇలా ముందస్తు పదవీ విరమణ చేయించడం అనేది అరుదుగా జరుగుతుందని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించాలని రైల్వే బోర్డు ఇదివరకే అన్ని జోనల్ కార్యాలయాలకు ఈ ఏడాది జులైలో లేఖ రాసింది. ప్రస్తుతం రైల్వేలో 13 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కొనసాగింపుగా తాజాగా 32 మంది అధికారులపై ‘ముందస్తు’ వేటు వేయడం గమనార్హం.
ఇదీ చూడండి: 'దిశ'ఎన్కౌంటర్కు ఓ యజమాని ఫిదా.. రూ.5 లక్షలు విరాళం