పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన దాదాపు 4వేల మందికి గత ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పించినట్లు హోంమంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీరిలో వందలాది మంది ముస్లింలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఈ మూడు పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణ చేపట్టింది. అయితే దీనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈశాన్య భారతంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా కూడా మారాయి.
మతం ముఖ్యం కాదు..
పౌరసత్వ చట్ట సవరణ.. విదేశాల నుంచి వచ్చే ఏ మత సమాజాన్ని లక్ష్యంగా చేసుకోదని హోంమంత్రిత్వశాఖ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
"గత ఆరేళ్లలో పాక్ నుంచి 2,830 మందికి, అఫ్గానిస్థాన్ నుంచి 912 మందికి, బంగ్లాదేశ్ నుంచి 172 మందికి భారత పౌరసత్వం కల్పించారు. వీరిలో వందలాది మంది ముస్లింలు ఉన్నారు. పాక్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో ముస్లింలు మెజారిటీ సమాజంగా ఉన్నారు. అయినప్పటికీ నమోదు, నేచురలైజేషన్ కోసం కావాల్సిన అర్హతలు ఉన్నట్లయితే వారు భారత పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంది."
- ఓ హోంమంత్రిత్వశాఖ సీనియర్ అధికారి
బంగ్లాదేశీయులకు.. పౌరసత్వం
4వేల మందికి మాత్రమే కాకుండా.. 14,864 మంది బంగ్లాదేశీయులకు కూడా భారత పౌరసత్వం లభించింది. 2014లో ఇరుదేశాల మధ్య సరిహద్దు ఒప్పందం తరువాత బంగ్లాదేశ్‌కు చెందిన 50కి పైగా ప్రాంతాలు భారత భూభాగంలో చేరడమే ఇందుకు కారణం.
ఇదీ చూడండి: 'పౌర' నిరసనలపై ఐరాస ఆందోళన