పాకిస్థాన్ నుంచి వలస వచ్చి రాజస్థాన్లో స్థిరపడిన కొందరికి భారత పౌరసత్వ సవరణ చట్టం-1955 ప్రకారం నేడు భారత పౌరులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌరసత్వం అందుకున్న వెంటనే అక్కడ వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు మారుమోగాయి. భారత పౌరసత్వం లేక అనేక ఏళ్లుగా వారంతా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. రాజస్థాన్లోని జైపుర్ పాలనాధికారి చేతులమీదుగా భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్లు చెమర్చాయి.
''ఇక్కడికి కలెక్టర్గా బదిలీపై వచ్చినప్పుడు నిమితేకం సంస్థ ప్రతినిధులు నాకీ సమస్య గురించి వివరించారు. నా పై అధికారులు సైతం పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పౌరులకు భారత పౌరసత్వాన్నిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన మిగిలిన పౌరులకు సైతం త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా.
--- అంతర్ సింగ్ నెహ్రా, జైపుర్ కలెక్టర్.
అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనర్హులుగా తేలినవారిని తిరిగి పంపిస్తామని కలెక్టర్ అన్నారు. 2009కి ముందు దరఖాస్తు చేసుకున్న వారందరికీ.. పాత చట్టానికి అనుగుణంగా పౌరసత్వం కల్పించాలని నిమితేకం సంస్థ అధ్యక్షుడు జై అహుజా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వీరంతా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.