దేశవ్యాప్తంగా 2020-21 విద్యా సంవత్సరంలో 179 వృత్తి విద్యా కళాశాలలు మూతపడ్డాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గణాంకాలు వెల్లడించాయి. గత తొమ్మిదేళ్లలో ఇంత భారీస్థాయిలో సాంకేతిక విద్యాసంస్థలు మూతపడటం ఇదే తొలిసారి.
ఐదేళ్లుగా ఆయా కళాశాలల్లో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడటం వల్ల.. ఈ ఏడాది సుమారు 134 విద్యా సంస్థలకు అనుమతి లభించలేదు. ఫలితంగా ఆ సంస్థలు కొనసాగించడానికి వీలులేకుండా పోయింది. ఇతర సాంకేతిక కారణంగా మరో 44 ఇన్స్టిట్యూట్లకూ అనుమతి కరవైందని ఏఐసీటీఈ పేర్కొంది.
ఐదేళ్లుగా ఇదే పరిస్థితి..
గత విద్యా సంవత్సరం(2019-20)లో 92 విద్యా సంస్థలు మూతపడగా.. 2018-19లో 89; 2017-18లో 134; 2016-17లో 163; 2015-16లో 126; 2014-15లో 77 కళాశాలలు నిర్వహణ అనుమతికి నోచుకోలేదు.
1.09లక్షల సీట్లు కోత - 39 వేల కొత్త సీట్లు
2020-21 విద్యా ఏడాదిలో వివిధ కారణాల వల్ల ఫార్మసీ, ఆర్కిటెక్చర్ సంస్థలలో సీట్లను తగ్గిస్తూ కేవలం 1.09 లక్షల సీట్లకు ఆమోదం తెలిపింది ఏఐసీటీఈ. అంతేకాకుండా నిర్దిష్ట కోర్సుల ఆధారంగా.. 762 కళాశాలల్లో సుమారు 69 వేల సీట్లకు కోతపెట్టింది. ఇదే సమయంలో 2020-21లో 164 కొత్త విద్యా సంస్థలకు అనుమతి మంజూరుచేసిన ఏఐసీటీఈ.. వాటి ద్వారా సుమారు 39వేల సీట్లకు ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి: దేశంలో తొలి డ్రోన్ శిక్షణ స్కూల్ అక్కడే..